న్యూఢిల్లీ : ‘ఇచ్చిన హామీని నిలుపుకున్నాను..ఇప్పుడు మీవంతు’ అంటూ మాజీ క్రికేటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు సవాల్ విసిరారు. దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయంగా మెడికల్ కిట్లను ఢిల్లీ సర్కార్‌కు గంభీర్ అందించారు. పీపీఈ కిట్లను ప్యాక్ చేసిన సంచుల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఇచ్చిన హామీని నేను నిలబెట్టుకున్నాను. వైద్యారోగ్య కార్యకర్తలకు వెయ్యి పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) కిట్‌లను పంపిణీ చేశాను. ఇప్పుడు మీ వంతు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి. మరిన్ని పరికరాల అవసరం ఉంటే వాటి వివరాలు నాకు తెలియజేయండి. పంపిస్తాను’ అంటూ కేజ్రీవాల్‌కు ట్వీట్ చేశారు. (గంభీర్ సాయం రూ. 50 లక్షలు)
కాగా, కరోనాపై పోరాటానికి గౌతమ్ గంభీర్ తన వంతు సహాయంగా ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం ఆసుపత్రిల్లో కరోనా చికిత్సకు అవసరమైన పరికరాల కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఆప్ ప్రభుత్వం స్వీకరించలేదు. దీంతో గౌతమ్.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అహం కారణంగా డబ్బులను స్వీకరించలేదని ఆరోపించారు. మరో రూ. 50 లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలను అందజేస్తున్నానని, ఇవి కనీసం పీపీఈ కిట్లు, మాస్క్‌ల కోసం ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై స్పందించిన కేజ్రివాల్.. గౌతమ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. ‘ఇక్కడ సమస్య డబ్బులు కాదు. పీపీఈ కిట్ల కొరత. వాటిని మీరు వెంటనే ఎక్కడి నుంచైనా తీసుకు రావడానికి మాకు సహాయం చేస్తే మంచిది. ఢిల్లీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుంది’ అంటూ చురకలంటించారు. (లాక్‌డౌన్ ఉల్లంఘించి.. ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ )
I have DELIVERED as PROMISED!
— Gautam Gambhir (@GautamGambhir) April 10, 2020
1000 PPE Kits to LNJP Hospital!@ArvindKejriwal now it is time for you to deliver on promises made to Delhi!
More equipment can be acquired. Do let me know place & details! @BJP4Delhi https://t.co/yxzrCpg8TT pic.twitter.com/YkqenL1WtN
అనంతరం కేజ్రీవాల్ ట్వీట్‌పై గంభీర్ బదులిస్తూ.. ‘ముందుగా మీ డిప్యూటీ సీఎం నిధుల కొరత ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు మీరు ఆయనకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. నేను 1000 పీపీఈ కిట్లను సిద్ధం చేశాను. వాటిని ఎక్కడ పంపిణీ చేయాలో నాకు తెలియజేయండి. ఇక మాటలు ముగిశాయి. పనిచేయాల్సిన సమయం వచ్చింది. మీ స్పందన కోసం కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు 700కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వైద్యులు, నర్సులు, కరోనాతో పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వారికి రక్షణ పరికరాల(పీపీఈ) కొరత ఏర్పడింది. దీంతో దేశంలో 1.7 కోట్ల పీపీఈ కిట్లను ఆర్డర్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. (కరోనాపై పోరు: వారికి రూ. కోటి పరిహారం)
Comments
Please login to add a commentAdd a comment