నల్లగొండ: దేశంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యం, కుల ద్వేషాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆ దిశగా మహాసభల్లో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం నల్లగొండలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఏర్పాటైన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) దేశానికి దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. సామాజిక, కుల, వర్గ పోరాటాలను బీఎల్‌ఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఎరుపు–నీలం రంగులు కలిసొచ్చి పోరాడటం అభినందనీయమన్నారు. ‘నల్లగొండ అంటే ఎర్రకొండ’అని.. ఈ ప్రాంతం నుంచి ఆరంభమైన వర్గ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
‘కార్పొరేట్’కు కేంద్రం దాసోహం
కార్పొరేట్ శక్తులు, ధనికులకు మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని, పేదలపై మరింత పన్నుల భారం పడనుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. రుణ భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకపోగా కార్పొరేట్‌కు సంబంధించి రూ.2 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే ప్రధాని మోదీ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే కొత్త ఎత్తుగడ వేస్తున్నారని, ఈ విధానాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.
పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం ఆకాంక్ష నెరవేరాలంటే బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని అన్నారు. మైనార్టీలు, దళితులు, బీసీలపై బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయమే బీఎల్‌ఎఫ్ ఎజెండా: తమ్మినేని
సామాజిక న్యాయమే ఎజెండాగా బీఎల్‌ఎఫ్ కార్యాచరణ ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న వారిలో 98 శాతం మంది బహుజనులేనని.. వారు ఉమ్మేస్తే ఆ సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. బంగారు తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని.. అయితే ‘బహుజన తెలంగాణ’బీఎల్‌ఎఫ్ అంతిమ లక్ష్య మని స్పష్టం చేశారు. అంతకుముందు మేకల అభినవ్ స్టేడియం నుంచి సభాప్రాంగణం వరకు రెడ్‌షర్ట్ వలంటీర్ల ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment