
నల్లగొండ: కేసీఆర్, ఎంఐఎం, బీజేపీలు మూడు వేరుకాదని, మూడూ ఒక్కటేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రజా ఫ్రంట్ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం బైపాస్ నుంచి గడియారం సెంటర్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీ నేతలు రాత్రి పూట కలసి ఉంటారని, పొద్దున్నే తిట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు దేశ, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ మద్దుతు పలికారని గుర్తుచేశారు. ఎంఐఎంకు ఆర్థిక లాభా లు చేకూర్చి తన గుప్పిట పెట్టుకున్నారని ఆరోపించారు. నిజాంకు రూ.200 కోట్ల బిల్డింగ్ ఉంటే కేసీఆర్‌కు రూ.300 కోట్ల బిల్డింగ్ ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, దీంతో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నష్టపోయిందని, అయినా ప్రజలకు మేలు జరగకపోవడం బాధాకరమన్నారు.
ప్రజాఫ్రంట్ మద్దతు పలికిన కోమటిరెడ్డిని గెలిపించాలని కోరారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెర వెనుక ఉండి కృషి చేసిన వ్యక్తి గులాం నబీ ఆజాద్ అని అన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే ముందే రద్దు చేసుకొని ఎన్నికలకు పోవడం ఎంతవరకు సమంజసమన్నారు. సమస్యల విషయంలో ప్రజలు కేసీఆర్ దగ్గరికు వెళ్లాలంటే ఆయన సెక్రటేరియట్‌కు రారని, ఆయన ఇంటికేమో ప్రజలను రానీయరని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ప్రజాపాలన కొనసాగుతుందన్నా రు. కోమటిరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి జైలులో పెట్టిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment