వారణాసి: ‘నమో అగైన్’ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించిన యువతి పట్ల ప్రియాంకగాంధీ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఆమెను దుర్బాషలాడుతూ ర్యాలీని దూరంగా గెంటేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వారణాసిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి అయిన ప్రియాంక గాంధీ అస్సీ ఘాట్ వద్ద ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక కాలేజీకి చెందిన ఓ యువతి ‘నమో అగైన్’ అని రాసి ఉన్న నీలిరంగు టీ షర్ట్‌ను ధరించి అటుగా నడుచుకుంటూ వెళుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె చుట్టూ మూగి.. దురుసుగా ప్రవర్తించారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు యువతిని అరెస్టుచేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చజెప్పడం వీడియోలో వినొచ్చు. అయితే, తాను బీజేపీ కార్యకర్తను కానని, కేవలం మోదీకి సపోర్టర్‌ను మాత్రమేనని ఆమె చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. మరోవైపు ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడుతూ ప్రియాంకగాంధీ ముందుకు సాగుతున్నారు. మీడియాతో సహా ప్రతి ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment