సాక్షి, న్యూఢిల్లీ : తాను ఎవరికి భయపడనని, ఒక వేళ భయపడి ఉంటే రాజకీయాల్లోకి రాకుండా ఇంట్లోనే కూర్చొనేదాన్ని అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. మంచి కోసమే రాజకీయాల్లోకి వచ్చా తప్ప వేరే ఏదో ఆశించి రాలేదన్నారు. బుధవారం ఆమె అమేథీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
చదవండి : మోదీపై పోటీగా అజయ్‌రాయ్
ప్రధాని మోదీపై వారణాసిలో పోటీచేయడానికి భయపడ్డారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఒకవేళ ప్రియాంకాగాంధీ భయపడి ఉంటే ఇంట్లో కూర్చునేది. మంచి కోసం రాజకీయాల్లోకి వచ్చా. వారణాసి నుంచి పోటీచేయనందుకు నేనేమీ బాధపడటం లేదు. ఒకవేళ నేను వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వచ్చేది. ప్రస్తుతం 41 లోక్ సభ స్థానాల బాధ్యత నా మీద ఉంది. వీరంతా నేను తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ నేను కూడా పోటీ చేస్తే.. కేవలం ఒక్క నియోజకవర్గం గురించే ఆలోచించాల్సి వస్తుంది. అలా చేస్తే.. ఈ 41 నియోజకవర్గాల అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనవుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే పోటీ చేయడం లేద’ని చెప్పుకొచ్చారు.
పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేయడం లేదు తప్ప ఎవరికో భయపడి కాదని బదులిచ్చారు. కాగా గత వారం వారణాసి అభర్థిగా అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన రాయ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment