వీరపునాయునిపల్లెలో జగన్‌తో పాదయాత్రలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, పార్టీ నేత దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు, హస్మా ఆవేదన విన్న అనంతరం మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత
ప్రజాసంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: 70 ఏళ్ల వృద్ధురాలికి పింఛను ఇస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందా? కొంపలేమైనా మునుగుతాయా? అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన మూడో రోజు బుధవారం వైఎస్సార్ జిల్లా కమలాపురం నిజయోకవర్గంలోని నేలతిమ్మాయిపల్లె నుంచి ఉరుటూరు వరకు నడిచారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వృద్ధులు జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తమకు వస్తున్న పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసిందని, ఇక ఎలా బతకాలని విలపించారు. వారి ఆవేదన విన్న జగన్ చలించిపోయారు. పండుటాకుల పట్ల సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి రాగానే వృద్ధులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నేలతిమ్మాయిపల్లి వద్ద ‘‘మా గోడు వినయ్యా, మమ్మల్ని ఆదరించయ్యా..’ అంటూ వృద్ధులు ముకుళిత హస్తాలతో జగన్ వేడుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎలాంటి సాయానికి నోచుకోక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న పండుటాకులే వారంతా. అందరి ఆవేదనను జగన్ ఓపిగ్గా విన్నారు. వృద్ధులకు ఆసరా కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
వృద్ధుల పింఛన్లు కట్
వయోవృద్ధులను ఆదుకోవడం సంక్షేమ రాజ్యం విధి. రూ.70గా ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.200కు పెంచారు. రాష్ట్రం విడిపోయే నాటికి ఏపీలో 43.11 లక్షలకు పైగా పింఛనుదార్లుండగా, ఇప్పుడు వారి సంఖ్య 44.90 లక్షలకు పైగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. 2014లో పునఃపరిశీలన పేరిట చంద్రబాబు ప్రభుత్వం కొందరి పింఛన్లను రద్దు చేసింది. పింఛను కోల్పోయిన వారిలో హస్మాలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. పింఛన్ల మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన వయో పరిమితి విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన వారిని వృద్ధులుగా గుర్తిస్తుండగా, ఏపీ ప్రభుత్వం మాత్రం 65 ఏళ్లు దాటితేనే వృద్ధులు అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే వృద్ధులందరినీ అక్కున చేర్చుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇవ్వడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.
ప్రతి మండలంలో వృద్ధాశ్రమం నిర్మిస్తాం..
వీరగట్టుపల్లెకు చెందిన మల్లారెడ్డి, ఆయన భార్య చురుక్కుమంటున్న ఎండలో జగన్‌ను చూసేందుకు బయలుదేరారు. అడుగులో అడుగేసుకుంటూ పాలగిరి క్రాస్‌రోడ్స్‌కు చేరుకునేందుకు నానా తంటాలు పడుతుంటే ఓ సహృదయుడు తన కారులో ఎక్కించుకుని తీసుకొచ్చారు. అక్కడ ఆ వృద్ధ దంపతులు జగన్‌ను కలిసి తమ గోడును వినిపించారు. ఆదుకోవాలని వేడుకున్నారు. తాటిమాకులపల్లికి చెందిన 75 ఏళ్ల సోగులపల్లి ఓబుళమ్మ సాయంత్రం 4 గంటలకు జగన్‌ను కలిసింది. నన్ను ఎవరూ చూడడం లేదయ్యా.. గూడు కల్పించయ్యా అని వేడుకున్న తీరు కలచివేసింది. వణుకుతున్న దేహంతో చేతి కర్ర ఊతంతో ఆమె తన దీనగాథను వివరించినప్పుడు చలించిపోయిన జగన్ ఓ నిమిషంపాటు నిశ్చేష్టులయ్యారు. ఓబుళమ్మను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో ఓ వృద్ధాశ్రమం నిర్మిస్తామని, పండుటాకులకు ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించారు.
హస్మా పింఛనుకు అర్హురాలు కాదా?
ఈమె పేరు సయ్యద్ హసీనా (హస్మా). నేలతిమ్మాయిపల్లి వాసి. వయసు 70 ఏళ్లు. నిరుపేద కుటుంబం. చాలాకాలంగా పింఛను కోసం ఎదురు చూస్తోంది. పంచాయతీ మొదలు ఎంఆర్‌ఓ కార్యాలయం దాకా ఎక్కడెక్కడో తిరిగింది. అధికారులను కలిసి తన సమస్యను చెప్పుకుంది. ఎవరూ కరుణించలేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తూ తమ గ్రామానికి వచ్చిన ప్రతిపక్ష నేత జగన్‌కు తన గోడు వినిపించి కన్నీటిపర్యంతమైంది. వృద్ధురాలైన హస్మా దుస్థితిని తెలుసుకుని జగన్ చలించిపోయారు. ఆమెకు సాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. అనంతరం హస్మాను మీడియాకు చూపుతూ... మీరే చెప్పండి, ఈమె పింఛనుకు అర్హురాలా, కాదా? ఈమెకు 70 ఏళ్లు ఉంటాయా? ఉండవా? ఈ వృద్ధురాలికి పింఛను ఇస్తే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందా? కొంపలేమైనా మునుగుతాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుటాకులకు తాను ఆసరాగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment