పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్‌ | Graduates And Teachers Elections Karimnagar | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్‌

Published Sun, Mar 3 2019 8:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Graduates And Teachers Elections Karimnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు షాక్‌ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి అధికారికంగా అభ్యర్థులను నిలపొద్దని పార్టీ నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రతికూల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పార్టీ అభ్యర్థులను బరిలో నిలపొద్దని భావిస్తున్నట్లు సమాచారం. ఇది టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ కావాలని కలలుగన్న ఆ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు.

ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని కరీంనగర్‌ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌తో పాటు ట్రెస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు ప్రయత్నించారు. కానీ టీఆర్‌ఎస్‌ అధికారికంగాఅభ్యర్థిని ప్రకటించలేమని స్పష్టం చేయడంతో రవీందర్‌ సింగ్‌ మౌనం దాల్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్న మేయర్‌ శనివారం కార్పొరేషన్‌లో బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ఇక యాదగిరి శేఖర్‌రావు ఇప్పటికే ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈనెల 5న భారీ ర్యాలీతో వచ్చి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు.

ఉద్యోగానికి చంద్రశేఖర్‌ గౌడ్‌ రాజీనామా
గ్రూప్‌–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్య మకాలం నుంచి కీలకంగా వ్యవహరించిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రభుత్వ ఉద్యోగానికి శని వారం రాజీనామా చేశారు. కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే ఆయన ఉద్యోగాన్ని వదులుకోగా.. ప్రభుత్వం వెంటనే ఆమోదించడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాలని భావించిన చంద్రశేఖర్‌గౌడ్‌ తనను అభ్యర్థిగా ప్రకటించాల్సిందిగా సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులను కలిశారు. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు అధికారిక అభ్యర్థి ఉండరని తేల్చినా.. అంతర్గతంగా మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అం దులో భాగంగానే ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే ఆమో దించారని ఆయన వర్గీయులు చెపుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం దీనిని ధ్రువీకరించడం లేదు. కాగా, చంద్ర శేఖర్‌గౌడ్‌ ఈనెల 5న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సైతం..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో కూడా టీఆర్‌ఎస్‌ తటస్థ వైఖరినే అవలంబించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీల జోక్యం వద్దని భావించిన టీఆర్‌ఎస్‌ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. తొలుత శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరిట ప్రకటన వెలువడినా.. ఆ తర్వాత పరిణామాలతో మిన్నకుండిపోయారు. దీంతో ఆయన ఉపాధ్యాయ సంఘాల తరుపునే పోటీలో ఉన్నారు. అలాగే, శని వారం పీఆర్‌టీయూ నుంచి కూర రఘోత్తంరెడ్డి నామినేషన్‌ దాఖ లు చేశారు. అలాగే ఎస్‌టీయూ నుంచి మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి కూడా బరిలో నిలిచారు.

కిటకిటలాడిన కలెక్టరేట్‌
గతనెల 25వ తేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, శనివారం మాత్రమే కలెక్టరేట్‌ సందడిగా కనిపించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం శుక్రవారం వరకు కేవలం నాలుగు నామినేషన్లు రాగా, శనివా రం ఒక్కరోజే 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన కళ్లెం ప్రవీణ్‌రెడ్డి, కామారెడ్డికి చెందిన ఏబీవీపీ మాజీ నాయకుడు గురువుల రణజిత్‌ మోహన్, పోరుపెల్లి ప్రభాకర్‌రావు, గుర్రం ఆంజనేయులు, తోడేటి శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, బుట్ట శ్రీకాంత్, ఎడ్ల రవికుమార్‌ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం ఒక్కరోజే పీఆర్‌టీయూ నుంచి కూర రఘోత్తంరెడ్డి, ఎస్టీయూ నుంచి మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు కొండల్‌రెడ్డి, చార్ల మానయ్య, నిథానియల్‌ తమ నామినేషన్లు సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement