
నల్లగొండ రూరల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టించారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ భైంసా, కామారెడ్డిలో మాట్లాడిన తీరు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిందే ఆయన మాట్లాడినట్లు తేలిందన్నారు. రాహుల్ ప్రసంగంలో పస లేదని ఎద్దేవా చేశారు.
దేశంలో రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారన్నారు. గద్దర్ అంటే కవి, గాయకుడిగా తనకు ఎంతో గౌరవమన్నారు. కానీ ఆయన తన కుటుంబంతో వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కుమారుడి కోసం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాననడం ఆత్మహత్యా సదృశం లాంటిదని విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఎన్‌కౌంటర్ జరగలేదన్నారు. కాంగ్రెస్‌లో 30 మంది నేతలు భార్య, కుమారులు, కూతుళ్ల కోసం టికెట్‌లు అడుగుతున్నారని, మరికొందరు పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లోనే కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉండగా.. కేసీఆర్‌ది కుంటుంబ పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు.