Gutta Sukhendra Reddy
-
తొలి విడతలోనా.., మలి విడతలోనా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అమాత్య పదవులపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. సరిగ్గా నెల రోజుల ముందటే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను, ఏకంగా తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రమే తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఇతర పార్టీల్లోనూ ఎమ్మెల్యేలుగా గెలిచి ఈసారి టీఆర్ఎస్ నుంచి మూడో విజయాన్ని అందుకున్న వారిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, రెండో విజయాన్ని అందుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఉన్నారు. ఇక, టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునిత, పైళ్ల శేఖర్‌రెడ్డి , ఎన్.భాస్కర్‌రావు రెండోసారి విజయాలు సాధించారు. వీరిలో ఈసారి కేబినెట్లో బెర్త్ ఎవరికి ఖరారు అవుతుందన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్న చర్చ. గత 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జి.జగదీశ్‌రెడ్డి తెలంగాణ తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా విజయం సాధించారు కాబట్టి ఆయనకు తిరిగి అమాత్య పదవికి దక్కుతుందని, రెండోసారి మంత్రి కావడం ఖాయం అన్నది పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక మంత్రులను తీసుకుంటారా..? లేక, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నపై సరైన సమాధానం ఎవరి వద్దా లేదు. ఒకవేళ నల్లగొండ జిల్లా నుంచి కూడా మంత్రిని తీసుకోవాల్సి వస్తే అవకాశం ఎవరికి తలుపు తడుతుందన్న అంశం చర్చకు ఆస్కారం ఇస్తోంది. రేసులో.. జగదీశ్‌రెడ్డి.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ? గతంతో పోలిస్తే.. ఈసారి జిల్లా నుంచి మూడు స్థానాలు అధికంగా టీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాలు నకిరేకల్, మునుగోడును కోల్పోయినా, తొలిసారి మిర్యాలగూడ, కోదాడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్లగొండ స్థానాలను దక్కించుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా సీనియర్లుగానే కనిపిస్తుండడంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నా.. ప్రధానంగా రేసులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కేబినెట్ ర్యాంకులో రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌కు బాధ్యత వహిస్తున్నారు. శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి, మంత్రి వర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నాయకులు మంత్రి పదవి రేసులో ఉన్నట్లు అవుతోంది. ఈ ఇద్దరు నేతలకు అవకాశం కల్పిస్తారా..? ఒకవేళ కల్పిస్తే తొలి విడతలో ఎవరిని తీసుకుంటారు..? మలి విడత దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏ నేత ఎదుర్కోనున్నారు అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తే...? తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రులకు తోడు పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్ చేసి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులకు సహాయకంగా (ఒక విధంగా సహాయ మంత్రులు) వీరికి శాఖలు కూడా కేటాయించారు. కానీ, కోర్టు కేసు వల్ల ఈ వ్యవస్థను రద్దు చేశారు. ఈసారి చట్టాన్ని మార్చి, కోర్టు గొడవలేం లేకుండా, పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు ఊపిరి పోస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ అంశం నిజరూపం దాలిస్తే.. అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చా నడుస్తోంది. గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కింది. మరోవైపు గత శాసన సభలో ప్రభుత్వ విప్‌గా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరికి ఏ పదవులు దక్కుతాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఈనెల 18వ తేదీన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో నేతల అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. -
రాహుల్‌ని తప్పుదారి పట్టించారు: గుత్తా
నల్లగొండ రూరల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టించారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ భైంసా, కామారెడ్డిలో మాట్లాడిన తీరు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిందే ఆయన మాట్లాడినట్లు తేలిందన్నారు. రాహుల్ ప్రసంగంలో పస లేదని ఎద్దేవా చేశారు. దేశంలో రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ దిక్సూచిగా నిలిచారన్నారు. గద్దర్ అంటే కవి, గాయకుడిగా తనకు ఎంతో గౌరవమన్నారు. కానీ ఆయన తన కుటుంబంతో వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కుమారుడి కోసం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాననడం ఆత్మహత్యా సదృశం లాంటిదని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదన్నారు. కాంగ్రెస్‌లో 30 మంది నేతలు భార్య, కుమారులు, కూతుళ్ల కోసం టికెట్లు అడుగుతున్నారని, మరికొందరు పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లోనే కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉండగా.. కేసీఆర్‌ది కుంటుంబ పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. -
సాగర్ నీటి విడుదల
నాగార్జునసాగర్: సాగర్‌వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. దీంతో ఆదివారం రెండు రేడియల్ (13, 14) క్రస్ట్‌గేట్లు ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నర్సింహ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సునీల్‌తో కలసి ఉదయం తొమ్మిది గంటలకు కృష్ణమ్మకు పూజలు చేసి రెండు గేట్లు ఎత్తారు. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో మూడుగంటల అనంతరం గేట్లను మూసివేశారు. -
ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: కల్తీలేని పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రోజు వారీ వినియోగించే బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కారం, సుగంధ ద్రవ్యాలు తదితర ఆహార ఉత్పత్తులను ఆ బ్రాండ్‌పై సరఫరా చేయనుంది. వాటిని విక్రయించేలా సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో పనిచేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే పీపీపీ పద్ధతిలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తారు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ విధివిధానాలు, రోజువారీ కార్యక్రమాలపై సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదనలు తయారుచేసి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికలో కార్పొరేషన్ లక్ష్యాలను, విధివిధానాలను వివరంగా తెలిపారు. ఆహార ఉత్పత్తులు, వాటి అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తుల గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేపట్టాలని సమితి నిర్ణయించింది. వాటిని సొంత బ్రాండ్‌పై విక్రయించనుంది. అలాగే రైతులు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరరాని పక్షంలో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. రైతు నుంచి వినియోగదారుని వరకు ఆహార ఉత్పత్తులు అందేలా గోదాములు, ప్యాకింగ్, కోల్డ్స్టోరేజీలన్నింటినీ అందుబాటులోకి తీసుకు వస్తారు. అలాగే ఆహార ఉత్పత్తులను సమీప రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తారు. సమితుల ద్వారానే అమలు.. వ్యవసాయశాఖ చేపట్టే వివిధ పథకాల అమలంతా రైతు సమన్వయ సమితుల ద్వారానే జరగాలని ప్రతిపాదించారు. రైతుబంధు పథకం, రైతుబంధు బీమా పథకం, పంటల బీమా, రుణాలు, రైతు వేదికలుసహా ఇతర వ్యవసాయ పథకాలన్నింటినీ సమితి ద్వారా అమలుచేయాలనేది రైతు కార్పొరేషన్ ఉద్దేశం. ఈ కార్యక్రమాలపై విధానపరమైన నిర్ణయాలను మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) తీసుకుంటారు. ఆ పోస్టును ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించే కీలక బాధ్యతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగిస్తారు. అందుకోసం ఈడీ పోస్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. జనరల్ మేనేజర్ పోస్టునే ఈడీగా మార్చాలని కూడా భావిస్తున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టును కూడా ఏర్పాటు చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈడీకి సహకరిస్తారు. రైతులు పండించిన పంటల సరఫరా డిమాండ్‌ను పరిశీలించాల్సిన బాధ్యత డిప్యూటీ జనరల్ మేనేజర్‌దే. ఎగుమతులు ఎక్కడికి చేయాలో నిర్ధారించాలి. రైతు కార్పొరేషన్‌కు వ్యవసాయాధికారులను నియమిస్తారు. అలాగే అకౌంట్ ఆఫీసర్‌ను నియమిస్తారు. -
‘పెట్టుబడి’ పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచి వాలయంలో రైతుబంధు, రైతు పాస్‌పుస్తకాల పంపిణీపై మీడియా సమావేశం జరిగింది. మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎవరూ చేయలేని పనిని సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు పేరుతో చేస్తున్నారన్నారు. ఈ నెల 10న హుజూరాబాద్‌లో రైతుబంధు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు. 1.4 కోట్ల ఎకరాలకు 58.06 లక్షల చెక్కులు, రూ.5,608.09 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. ముందుగా 1.3 కోట్ల ఎకరాల్లో 56.14 లక్షల ఎకరాలకు 5,392.29 కోట్లు పంపిణీ చేస్తారన్నారు. మొత్తం 10,823 గ్రామాల్లో పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, పంచాయతీరాజ్ బిల్డింగ్, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా మంచినీళ్లు, టెంట్ లాంటివి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు రైతుకే ఇవ్వాలని, రైతు అక్కడికి రాకుంటే రైతు ఇంటికెళ్లి చెక్కులు ఇవ్వాలని సూచించామన్నారు. పాస్‌పుస్తకాల ముద్రణకు 8 కంపెనీలు ముందుకొచ్చాయని, టెండర్ల ద్వారా ఈ–ప్రక్రియ జరిగిందన్నారు. ముద్రణ టెండర్‌ను మద్రాసు కంపెనీ దక్కించుకుందన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లా డుతూ రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గొప్ప ఆలోచనని కొనియాడారు. పాస్‌పుస్తకాల ముద్రణలో కొన్ని తప్పులుంటే వాటిని కలెక్టర్ కార్యాలయంలో సవరిస్తారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని తేల్చి చెప్పారు. దీన్ని మీడియా భూతద్దంలో చూపొద్దని, ఈ గొప్ప కార్యక్రమంలో మీడియా కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్లైసెన్స్, ఓటర్ ఐడీకార్డు చూపించి రైతుబంధు చెక్, పాస్‌పుస్తకాలు తీసుకోవచ్చని అన్నారు. మొత్తం రూ.90 కోట్లతో ముద్రణ జరిగితే 80 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. వ్యవసాయం చేయనివాడు చెట్టుమీద ఉండి ఏదైనా మాట్లాడొచ్చని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎనిమిది జాతీయ బ్యాంకుల ద్వారా డబ్బులు సమకూర్చామని అన్నారు. మూడు నెలల్లోపు రైతు ఎప్పుడైనా చెక్‌ను బ్యాంకులో వేసుకోవచ్చని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ఈ ఎనిమిది రోజుల కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, సభ్యులు పాల్గొంటారన్నారు. -
వలపట.. దాపట తెలిసే పార్టీలు మారుతున్నారా..?
ఎంపీ గుత్తాపై కుంభం కృష్ణారెడ్డి ఫైర్ నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిని విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ కుంభం కృష్ణారెడ్డి అన్నారు. వలపట.. దాపట తెలిసే గుత్తా పార్టీలు మారుతున్నారా అని ప్రశ్నించారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పదివిని ఆశిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని విమర్శిస్తే స్థాయి కాదని తెలు సుకోవాలన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్హాల్లో రైతు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సుకు రాష్ట్ర ఇన్చార్జి కుంతియా హాజరుకానున్నారన్నారని తెలిపారు. సమావేశంలో ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ పెరిక వెంకటేశ్వర్లు, చింతమల్ల బాలక్రిష్ణ, శివాజీ, సందీప్, రవి పాల్గొన్నారు. -
కోర్టులు రాజకీయ వేదికలా?
► ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరుపై హైకోర్టు మండిపాటు ► పలువురికి కేబినెట్ హోదాపై పిల్ ఉపసంహరణకు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పం దించింది. కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లకముందు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేం దుకు అనుమతి కోరడంపై ఆగ్రహించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఎలా ఉపసంహ రించుకుంటారని ప్రశ్నించింది.ఇందుకు తాము ఎంత మాత్రం అంగీకరించబోమని చెప్పింది. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలు గా మార్చుకోవడానికి వీల్లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నచ్చనప్పుడు కోర్టులో వ్యాజ్యాలు వేసి, నచ్చినప్పుడు ఉపసంహరిం చుకుంటామంటే కుదరదని పేర్కొంది. ఈ వ్యాజ్యాల్లో వాదనలు వినిపించకున్నా ఫర్వాలే దని, తాము విచారణను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. కావాలంటే పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మాత్రం ఉపసం హరించుకోవచ్చునంది. పలువురికి కేబినెట్ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను ఉపసంహరించు కునేందుకు అంగీకరించబోమంది. తదుపరి విచారణను కొనసాగిస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పుడు వివిధ హోదాల్లో ఉన్న పలువురికి కేబినెట్ హోదానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ ఆయన 2015లో పిల్ దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం పలువురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యద ర్శులుగా నియమిస్తూ జీవో జారీ చేసింది. దీన్ని కూడా గుత్తా సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. ఆ తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో తాను 2015లో దాఖలు చేసిన పిల్, రిట్ పిటిషన్‌ను ఉపసం హరించుకునేందుకు అనుమతిని కోరుతూ దరఖాస్తును కోర్టు ముందుంచారు. రెండు వ్యాజ్యాలు మంగళవారం ధర్మాసనం ముందు కు వచ్చాయి. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పిల్ ఉపసంహరణకు అనుమతిని నిరాకరించింది. -
విచారణకు ఆదేశించండి
- జూబ్లీ క్లబ్ అక్రమాలపై సివిల్ కోర్టులో పిటిషన్ - గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని వినతి సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జూబ్లీ క్లబ్) సభ్యత్వాలు, నిర్మాణాల విషయాల్లో అక్రమాలపై విచారణ జరిపేందుకు ఓ విచారణాధికారిని నియమించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. సభ్యత్వ రుసుం వసూలు చేయకుండా సభ్య త్వాలు ఇవ్వడం, కోట్ల రూపాయల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయంటూ హైకోర్టు న్యాయవాది డి.వి.శివప్రసాద్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు టి.దేవేందర్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కోశాధికారి ఎ.సుబ్బారావు, సభ్యులు వెంకటేశ్వరరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎం.జనార్దన్‌రెడ్డి, ఎం.వెంకటరామయ్య తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 20 వేల చదరపు అడుగుల్లో చేపట్టాల్సిన నిర్మాణాలను 1.2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు. ఈ నిర్మాణాలకు రూ.30 కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చూపుతున్నారన్నారు. నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై థర్డ్ పార్టీ ఆడిటర్లను నియమించాలని గవర్నింగ్ కౌన్సిల్లో ప్రాథమికంగా నిర్ణయించగా, ఆ తరువాత ఆ నిర్ణయాన్ని రద్దు చేశారని ఆయన వివరించారు. ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు... గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు 2010 నుంచి 2017 వరకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా క్లబ్ సేవలు పొందారని పిటిషనర్ తెలిపారు. ఇదంతా అధ్యక్ష, కార్యదర్శులకు తెలిసే జరిగిందన్నారు. సుఖేందర్‌రెడ్డి తదితరుల సభ్యత్వాలను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.