పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులతో ప్రియాంకా గాంధీ
వయనాడ్: పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశిస్తే వారణాసిలో లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. రాహుల్ పోటీచేస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం నిర్వహించారు.
అసమ్మతి గొంతుక అణచివేత
ప్రజాస్వామ్యాన్ని, అసమ్మతి గొంతుకను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణచివేస్తోందని ప్రియాంక ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ వీవీ వసంతకుమార్ కుటుంబాన్ని పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. ‘మనమంతా ప్రేమించే, నమ్మే దేశాన్ని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ దేశంలో అయితే మనమంతా స్వేచ్ఛగా ఉంటామో, ఎక్కడైతే మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలమో, మనకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూ, నచ్చిన ఆహారాన్ని తింటూ ఇష్టమైన జీవనశైలిని గడపగలమో.. దాన్ని కాపాడుకునేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ గొప్ప లక్ష్యం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు. ప్రియాంకను ఓ దొంగ భార్యగానే ప్రజలు చూస్తారన్న కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘మా నానమ్మ, నాన్న, మా అమ్మ.. వీళ్లందరిని బీజేపీ నేతలు ఏదో ఒక కారణం చూపి విమర్శించేవారు. వాళ్లు ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటారు. మేం మా పనిలో ముందుకు సాగుతాం’ అని అన్నారు.
అధికారం కోసం పోటీ చేయట్లేదు
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. ‘దేశంలో అనూహ్యంగా ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించలేని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా భయపడుతున్నారు. ప్రజాహక్కులను కాపాడాల్సిన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు. విమర్శలకు భయపడే ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించాలని మీ అందర్ని కోరుతున్నా. సంకుచిత భావజాలంతో వ్యవహరించే వ్యక్తుల నుంచి, అసమ్మతిని అణచివేసే వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చెప్పారు. పర్యటనలో భాగంగా వయనాడ్ నుంచి సివిల్స్ సాధించిన తొలి గిరిజన యువతి శ్రీధన్య సురేశ్‌ను కలుసుకున్న ప్రియాంక ఆమెను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment