బుధవారం కొడంగల్, జహీరాబాద్‌లకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలను కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న మంత్రి హరీశ్. చిత్రంలో మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి వ్యతిరేక పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో స్థానం లేదని సాగునీటి మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడకుండా అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా మారాయని విమర్శించారు. మహాకూటమి పేరుతో తెలంగాణ అభివృద్ధి నిరోధక పార్టీలు వస్తున్నాయని, ప్రజలు వాటిని తిరస్కరించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమమే ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు సూత్రమన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణభవన్‌లో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష పార్టీల నేతలు మంత్రుల నివాస సముదాయంలో హరీశ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి హరీశ్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను ఓట్లెలా అడుగుతాయి. ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారని అభివృద్ధి నిరోధక పార్టీలను ప్రజలు ప్రశ్నించాలి. 60 ఏళ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని నిలదీయాలి’ అని చెప్పారు.
మీరు కలలో కూడా ఊహించని ప్రగతి..
కాంగ్రెస్, టీడీపీలు కలలో కూడా ఊహించని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని హరీశ్ చెప్పారు. ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రూ.1,000 పెన్షన్, కేసీఆర్ కిట్, ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి, రూ.5 లక్షల రైతు బీమా, కంటి వెలుగు.. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ తెచ్చారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు నీరం దించే ప్రయత్నం జరుగుతోంది. ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను కాంగ్రెస్, టీడీపీలు ఏనాడైనా ఆలోచించాయా?’ అని వ్యాఖ్యానించారు.
ఒక్క దెబ్బతో బుద్ధి చెప్పాలి..
తెలంగాణ సాధకులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయని హరీశ్ అన్నారు. ‘రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ అవకాశవాదంతో ఒక్కటవుతున్నాయి. ఒక్క దెబ్బతో 4 పార్టీల కు బుద్ధి చెబుదాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ మాట్లాడుతున్నారు. పోలవరానికి జాతీయ హోదానిచ్చి తెలంగాణకు అన్యాయం చేశారు. కొడం గల్‌కు పాలమూరు పథకంతో నీళ్లు తీసుకొస్తాం. మహబూబ్‌నగర్‌కు అన్యాయం చేసింది చంద్రబాబే. రైతుల ఉసురు కోదండరామ్‌కు తప్పక తగులుతుం ది. సర్వశక్తులు ఒడ్డి ప్రాజెక్టులను అడ్డుకునే యత్నం చేశారు. కొడంగల్‌లో నరేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి’ అని చెప్పారు.
టీఆర్‌ఎస్‌ను బలపరచాలి
ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి, రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను బలపరచాలని హరీశ్ ప్రజలను కోరారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుం డా ఓడించాలి. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఏం చేయలేదు. జహీరాబాద్ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు పార్టీ గెలుపునకు కృషి చేయండి. ఐదేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో మీ కోసం మేం పని చేస్తాం. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ సారి గులాబీ జెండానే ఎగురుతుంది’ అని హరీశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.గుండప్ప ఆయన అనుచరులు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు శాంతమ్మ, బీజేపీ మాజీ ఇన్‌చార్జి రాంకుమార్ దేశ్‌పాండే, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అసోసియేటెడ్ అధ్యక్షుడు ఎం.సుభాశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కొడంగల్ టీఆర్‌ఎస్ నేత గుర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: జగదీశ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసే ఇతర పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. పలుసార్లు గెలిచామని చెబుతున్న కాంగ్రెస్ వాళ్లు జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. 60 ఏళ్ల పాటు జిల్లాను నాశనం చేసింది వారే. అభివృద్ధి గత నాలుగేళ్లలోనే జరిగింది. 28 ఏళ్ల తర్వాత మూసీ నీటిని మొదటి పంటకు ఇచ్చాం’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment