కాంగ్రెస్‌ వస్తే మళ్లీ చీకట్లే.. | Harish rao fired on congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వస్తే మళ్లీ చీకట్లే..

Published Sun, Aug 5 2018 1:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Harish rao fired on congress - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  రానున్న ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు మళ్లీ చీకటిమయమవుతాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్‌ పనితీరును దేశమంతా గమనిస్తోందని పేర్కొన్నారు.

శనివారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో బస్‌డిపో, అధునాతన బస్‌స్టేషన్‌ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పి.మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణతో కలసి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

అందరి తిప్పలు తప్పాయి..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర రైతాంగానికి ఎరువులు, విత్తనాలు, కరెంట్‌ తిప్పలు తప్పాయని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజలు పవర్‌ ఫుల్‌ అయితే.. కాంగ్రెస్‌కు పవర్‌ నిల్‌ అయిందని ఎద్దేవా చేశారు. ఒకవేళ పొరపాటున మళ్లీ కాంగ్రెస్‌ వస్తే పాతరోజులు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులపై ప్రేమతో ఎకరానికి రూ.8 వేలు పంటల పెట్టుబడికి ఇస్తున్నారని.. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి సైతం పెట్టుబడి సాయం చెక్కులు తీసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలందరూ పొద్దుపోయిన తర్వాత వెళ్లి రైతుబంధు చెక్కులు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

రైతుబంధు పథకం కేసీఆర్‌ ఉన్నంత కాలం ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలో రైతు బీమా కూడా అమలు చేస్తామన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఢిల్లీలో కేసీఆర్‌ గురించే చర్చ జరుగుతోందన్నారు. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి మహారాష్ట్రలోని కొన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. అలాగే జహీరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న కర్ణాటక ప్రాంతాల వారు కూడా ఇదే డిమాండ్‌ తీసుకొస్తున్నారని చెప్పారు. అభివృద్ధి విషయంలో కొడంగల్‌ నియోజకవర్గంలో ఇన్నాళ్లూ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని వివరించారు.

ఎన్నో ఏళ్లుగా కోస్గిలో బస్‌డిపో ఏర్పాటు కలగా మిగలగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని నెరవేర్చిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి డిపో కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గికి మాత్రమే దక్కిందన్నారు. రాబోయే 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు. కొడంగల్‌లో కూడా గులాబీ జెండాను రెపరెపలాడిస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమాల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీచార్జి..
కోస్గి బస్‌స్టేషన్‌ శంకుస్థాపన అనంతరం పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రేవంత్‌రెడ్డి వెంట వందలాదిగా తరలివచ్చిన అనుచరులు ఆయన వెంటే వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గందరగోళం నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేసి కాంగ్రెస్‌ శ్రేణులను తరిమికొట్టారు.


కష్టపడే మంత్రి హరీశ్‌: నాయిని
రాత్రీపగలు తేడా లేకుండా నిరంతరం కష్టపడు తూ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర కేబినెట్‌లో ఐకాన్‌గా నిలుస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశం సించారు. హరీశ్‌రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ నాలుగేళ్లుగా అభివృద్ధి యజ్ఞం చేస్తున్నారని, అందుకే 60 ఏళ్లలో ఎన్నడూ లేని అభి వృద్ధిని చూస్తున్నామన్నారు.

కొన్ని మీడియా సంస్థలు దేశంలోని 29 రాష్ట్రాల్లో సర్వే చేస్తే సీఎం కేసీఆర్‌ అందరి కంటే ముందున్నట్లు వెల్లడించాయని తెలిపారు. తెలంగాణ వస్తే హిందూ–ముస్లిం గొడవలు, నక్సలైట్లు వస్తారంటూ పిచ్చి వాగుడు వాగిన వారే అడ్రస్‌ లేకుండా పోయారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండా ‘వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జోరుకు పిచ్చి కూతలు కూసే గీ పిల్లగాడు అమ్మ దగ్గర పాలు తాగడానికి పోవడం ఖాయం’ అంటూ ఎద్దేవా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement