ఎన్నికల ప్రచార సభలో భాగంగా డప్పు వాయిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన సీఎం కేసీఆర్.. కోదండరాంను దగ్గరకు తీశారని, కేసీఆర్ నీడలోనే కోదండరాంకు బలం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అయితే దీనిని గుర్తించకుండా తనకే సొంత బలం ఉందని కోదండరాం అనుకోవడం శోచనీయమని అన్నారు. నిజంగా ఆయనకే అంత బలం ఉంటే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అదీ ఒకటి, రెండు సీట్ల కోసం గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సత్తా ఉంటే ఒంటరిగానే పోటీ చేయాలన్నారు.
తమ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే.. దానిని అడ్డుకునేందుకు కోదండరాం కూడా ప్రయత్నం చేశారని ఆరోపించారు. రైతులకు మేలు జరిగే పనిని అడ్డుకున్న కోదండరాంకు వారి ఉసురు తగులుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ మండలం గుర్రాలగొంది, చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరై మాట్లాడారు.
దీవిస్తున్నాం.. లక్ష మెజారిటీతో గెలిచి రండి..
‘మీరు మా గ్రామానికి అన్నీ చేశారు.. మా కుటుంబ సభ్యునిలా ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు. ఎన్నికల ప్రచారం మా గ్రామం నుంచి ప్రారంభించినందుకు మా గ్రామస్తులం దీవిస్తున్నాం. మీకే ఓటు వేస్తామని తీర్మానం చేస్తున్నాం. మా గ్రామంలోని మహిళా సంఘాలు, కుల సం ఘాలు.. అందరం రూపాయి, రూపాయి పోగుచేసిన డబ్బులు రూ.30,218 ఇస్తున్నాం. ఈ డబ్బులతోనే నామినేషన్ వేయండి. లక్ష మెజారిటీతో గెలిచి రండి’ అంటూ గుర్రాలగొంది గ్రామస్తులు మంత్రి హరీశ్‌కు తాము విరాళంగా సేకరించిన డబ్బులను అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి ‘నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను’ అం టూ ఉద్వేగంగా అన్నారు. తనపై నమ్మకంతో ఆరోసారి కూడా సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు..
తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటు వెయ్యరని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో బలం లేదని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలతో పొత్తుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2009 లో ప్రకటించిన విధంగా తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది విద్యార్థులు చనిపోయేవారు కాద న్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు బాధ్యత కాంగ్రెస్‌దే అని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేసీ, సీపీఐ.. ఇలా ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలిచేది టీఆర్‌ఎస్ పార్టీయేనని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసత్యపు, ఆచరణకు సాధ్యం కాని హామీలిస్తూ కాం గ్రెస్ ప్రజల వద్దకు వస్తోందని, ఎన్ని ఎత్తులు వేసినా కనీసం ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్‌కు దక్కదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పడం శోచనీయమని అన్నారు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అటువంటి కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడాన్ని చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పొత్తుతో ఎన్‌టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు.
రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ..
తెలంగాణకు బీజేపీ కూడా అన్యాయం చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధికి నిధులు కావాలని కోరినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అదే మన పక్కన ఉన్న మహారాష్ట్రకు నిధులు వరదలా మంజూరు చేసిందన్నారు. నాలుగేళ్లుగా హైకోర్టు విభజన గురించి పట్టించుకోలేదన్నారు. ఇటువంటి బీజేపీకి కూడా తెలంగాణలో స్థానం ఉండదన్నారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment