అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించగలరా? | high court fires on revanth reddy midnight arrest | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించగలరా?

Published Thu, Dec 6 2018 5:40 AM | Last Updated on Thu, Dec 6 2018 8:50 AM

high court fires on revanth reddy midnight arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు అధికా ర పార్టీ అధ్యక్షుడిని చేయగలరా? అని హైకోర్టు బుధవారం పోలీసులను ప్రశ్నించింది. రేవంత్‌ అరెస్టు విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోలేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌తో ముఖ్యమంత్రి సభకు ఇబ్బంది కలుగుతుందని భావించినప్పుడు అతన్ని గృహ నిర్బంధం చేసి ఉండొచ్చునని, గడప దాటరాదని ఆంక్షలు విధించి ఉండొచ్చునని పేర్కొంది. చట్టం నిర్దేశించిన విధి విధానాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అభ్యంతరకరమని పేర్కొంది.

టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) పంపిన లేఖపై కూడా రజత్‌కుమార్‌ సంతకం లేకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రేవంత్‌ నిర్బంధానికి దారి తీసిన పరిస్థితులు, నిఘా నివేదికలు, తేదీలు తదితర అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, గడువునివ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ పదే పదే అభ్యర్థించడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

డీజీపీ హాజరయ్యేలా చూడండి...
సీఎం సభను జరగనివ్వనని రేవంత్‌ ప్రకటించారని, అల్లరిమూకలను పంపి ఘర్షణలు సృష్టించాలన్నది ఆయన వ్యూహమని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని ఏజీ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పంది స్తూ, అధికార పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ సభలను జరగనివ్వనని చెబితే ఆ కారణంతో పోలీసులు నిర్బంధించగలరా? చట్టం ముందూ అందరూ సమానమేనంటూ అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించే తెగువ పోలీసులకు ఉందా అని ప్రశ్నించింది. రేవం త్‌ని అర్ధరాత్రి నిర్బంధించాలని ఎస్పీకి ఎవరు చెప్పారని, డీజీపీ అటువంటి ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము స్వయంగా డీజీ పీ నుంచి స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నామంది. మధ్యాహ్నం 2.15కి తమ ముందు డీజీపీ హాజరయ్యే లా చూడాలని ఏజీకి ధర్మాసనం పేర్కొంది.

నోట్‌ ఫైళ్లపైనే సంతకాలు, సీలు..
మొదట సరేనన్న ఏజీ, ఆ తరువాత డీజీపీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. కోర్టు ఆదేశించిన తరువాత ఆయన ఎక్కడున్నా కూడా తమ ముందు హాజరు కావాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం నేరుగా డీజీపీ నుంచి కొన్ని వివరణలు అడిగింది. టీఆర్‌ఎస్‌ ఫిర్యా దు మేరకు తెలంగాణ సీఈవో తమకు లేఖ రాశారని, కొడంగల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని కోరారని, దీనిలో భాగం గానే చర్యలు తీసుకున్నామని డీజీపీ చెప్పారు. నిఘా అధికారులు, ఎస్పీకి మధ్య జరిగిన సంప్రదింపుల డాక్యుమెంట్లపై తేదీలు, సంతకాలు, ఆఫీసు సీలు లేకపోవడంపై ప్రశ్నించగా, నోట్‌ ఫైళ్లపై మాత్రమే సంతకాలు ఉంటాయని డీజీపీ చెప్పారు. ఈ సమాధానంపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు.

నిర్బంధం అక్రమమా? సక్రమమా? అన్నదే ముఖ్యం...
ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, సంతకాలు లేనంత మాత్రాన ఓ డాక్యుమెంట్‌ తన విలువను కోల్పోదని, మిగిలిన ఇతర అంశాలను కూడా పరి గణనలోకి తీసుకోవాలని, ఈ మొత్తం వ్యవహారం పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పారు. రేవంత్‌ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే విడుదల చేశామని చెప్పగా, ఇక్కడ రేవంత్‌ విడుదల చేశారా? లేదా? అన్నది సమస్య కాదని, అరెస్టు సక్రమమా? అక్రమమా? అన్నదే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. విచారణ జరుగుతున్నంత సేపు కోర్టు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement