సాక్షి ప్రతినిధి, కడప: మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు గ్రామంలో ఆదివారం బీభత్సం సృష్టించింది. గ్రామంలో ఇటీవల వివాహమైన ఓ నూతన దంపతులను ఆశీర్వదించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు తరలిరావడం తమ ఆధిపత్యానికి సవాలుగా భావించిన మంత్రి వర్గీయులు గ్రామంలో వీరంగం సృష్టించారు. రౌడీమూకలను వెంటేసుకుని మంత్రి తనయుడు సుధీర్‌రెడ్డి గ్రామంలో వీరంగమేశారు. మాకు తెలియకుండా వైఎస్సార్‌సీపీ నాయకులను ఆహ్వానిస్తారా? అంటూ తమకు వైరిపక్షంగా భావించిన కుటుంబాలపై దాడులకు తెగబడ్డారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు.
తమ ఆధిపత్యానికి ప్రశ్నార్థకంగా నిలుస్తారని భావించిన వారినందర్నీ కొట్టుకుంటూ వెళ్లారు. గ్రామంలో ఇంతగా వీరంగం వేస్తున్న మంత్రి వర్గీయులను అడ్డుకోని పోలీసులు.. వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలను పెద్దదండ్లూరు వెళ్లకుండా మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. కనీసం ముగ్గురినైనా అనుమతించాలని కోరినా పట్టించుకోలేదు. ఇందుకు నిరసనగా బైటాయించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జికి పాల్పడ్డారు. వివరాలు.. మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడి. ఆ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాల్లో వారి ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోననే అభద్రతాభావంతో ఆది కుటుంబం ఉంది. ఈ క్రమంలో పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ సంపత్ వివాహం మే 25న జరిగింది. వివాహానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర నాయకులను ఆహ్వానించారు.
అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉండిపోయినందున పెళ్లికి ఎంపీ హాజరవలేదు. దీంతో ఆదివారం నూతన దంపతులను ఆశీర్వదించేందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. మేయర్ సురేష్‌బాబు, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డితో కలసి పెద్దదండ్లూరుకు పయనమయ్యారు. ఇది తెలుసుకున్న మంత్రి ఆది తనయుడు సుధీర్‌రెడ్డి రౌడీమూకలను వెంటేసుకుని పెద్దదండ్లూరు చేరుకున్నారు. తొలుత సంపత్ కుటుంబం ఏర్పాటు చేసుకున్న షామియానా కూల్చి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గ్రామ నాయకుడు సంజీవరెడ్డి కుటుంబంపై విరుచుకుపడ్డారు.
తమకు వైరిపక్షంగా ఉన్న కుళాయిరెడ్డి, అంజయ్య, అయ్యవారు కుటుంబాలకు చెందినవారు కనిపించగా వారిపై దాడులకు తెగబడ్డారు. ట్రాక్టర్, స్కార్పియో వాహనాలను ధ్వంసం చేశారు. ఒకవైపు గ్రామంలో మంత్రి కుమారుడు దాడికి పాల్పడుతుంటే.. మరోవైపు మంత్రి కుటుంబసభ్యులు సుగమంచిపల్లెలో ఉన్న వైఎస్సార్‌సీపీ వర్గీయుడు సుబ్బరామిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీని విస్తరిస్తున్నారంటూ సుగమంచిపల్లెలో మంత్రి సతీమణి అరుణ వ్యాఖ్యానించగా.. గ్రామస్తులు తిరగబడటంతో వారు జారుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు...
మంత్రి కుటుంబసభ్యులు, అనుచరులు వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోని పోలీసులు మరోవైపు ఆ గ్రామాల్లోకి వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్లరాదంటూ అడ్డగించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి తదితరులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి కల్పించుకుని.. తనతోపాటు సురేష్‌బాబు, డాక్టర్ సుధీర్‌రెడ్డి పెద్దదండ్లూరు వెళతామని అనుమతించాలని కోరారు. పోలీసులు ససేమిరా అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జికి పాల్పడ్డారు. అవినాష్‌రెడ్డి, సురేష్‌బాబు, సుధీర్‌రెడ్డిని కడప శివారులోని చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి సైతం ఎదురుదెబ్బ తగిలింది. పెద్దదండ్లూరులో మంత్రి ఆది తనయుడు తన అనుచరులపై దాడి చేశారని తెలుసుకున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వారిని పరామర్శించేందుకు బయల్దేరగా పోలీసులు జమ్మలమడుగులో అడ్డుకున్నారు.
Published Sun, Jun 3 2018 7:02 PM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment