ప్చ్‌.. అదే సాకు! | House is not going smoothly says Lok Sabha Speaker Sumitra Mahajan about No confidence motion | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. అదే సాకు!

Published Tue, Mar 20 2018 1:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

House is not going smoothly says Lok Sabha Speaker Sumitra Mahajan about No confidence motion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తీసుకోకుండానే లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. సభ సజావుగా లేనందున మద్దతిచ్చే సభ్యులను లెక్కించడానికి వీలుకాదనే కారణంతో సోమవారం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను వాయిదావేశారు. ఇదే కారణం చెప్పి శుక్రవారం కూడా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోని విషయం తెలిసిందే. అదే రోజు సభ వాయిదా పడ్డ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి వారు అవిశ్వాసం నోటీసులిచ్చారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12.06 గంటలకు సభాపతి అవిశ్వాసం నోటీసులను ప్రస్తావించారు. ‘కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహం, గల్లా జయదేవ్‌ నుంచి నోటీసులు అందాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు లేచి నిలుచుంటే వారిని లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. అప్పుడే నేను వారిని లెక్కించి ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించగలను’ అని పేర్కొన్నారు. తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్‌ సీపీతో పాటు విపక్షాల సభ్యులంతా మద్దతుగా వారి స్థానాల్లో నిలబడ్డారు. ఇందులో కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎంఐఎం, ఆమ్‌ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు ఉన్నారు. శివసేన తటస్థంగా ఉంటామని గతంలోనే ప్రకటించింది. 

టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే ఆందోళన..
స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం ప్రస్తావన తెచ్చిన సమయంలో రిజర్వేషన్ల కోటా పెంపు కోసం టీఆర్‌ఎస్, కావేరీ నదీ బోర్డు ఏర్పాటు కోసం ఏఐఏడీఎంకే ఎంపీలు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. వారిని వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని సభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ ఎంపీలు పట్టించుకోలేదు. సభ ఆర్డర్‌లో లేనందున తీర్మానపు నోటీసును సభ దృష్టికి తేలేకపోతున్నాను.. ఐ ఆమ్‌ సారీ అని చెబుతూ స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

మరోసారి నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి, తోట
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం మరోసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. ‘కేంద్ర మంత్రి మండలిపై ఈ సభ అవిశ్వాసం ప్రకటిస్తోంది’ అన్న తీర్మానాన్ని మంగళవారం నాటి బిజినెస్‌ లిస్ట్‌లో చేర్చాలని విన్నవించారు. అలాగే ఈ తీర్మానం వస్తున్నందున పార్టీ ఎంపీలంతా హాజరై తీర్మానం ప్రవేశపెట్టేందుకు మద్దతుగా నిలబడాలని, తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని పేర్కొంటూ వైఎస్సార్‌ సీపీ చీఫ్‌ విప్‌ వైవీ సుబ్బారెడ్డి త్రీలైన్‌ విప్‌ జారీచేశారు.

హోదాకు మా మద్దతు: డీఎంకే
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని డీఎంకే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎంపీ తిరుచ్చి శివ సోమవారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే పార్టీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. 

టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో చర్చిస్తున్నాం: మేకపాటి
లోక్‌సభ ప్రారంభానికి ముందు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పీవి మిథున్‌రెడ్డి పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. 11 గంటలకు సభ వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. ధర్నా వద్ద మీడియాతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే నేతలతో కూడా మాట్లాడుతున్నామని, సహకరించాలని బతిమాలామని చెప్పారు. వాళ్ల రాజకీయ కోణాలు వాళ్లవని, చంద్రబాబును మించినవారు అని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా నిమ్మకునీరెత్తినట్టు ఉన్నారని, హోదా ఉద్యమాన్ని హేళన చేశారని విమర్శించారు. హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేశారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోరాడుతున్నానంటున్నారని విమర్శించారు. 

ప్రజల గొంతునొక్కుతున్న ఎన్డీఏ, స్పీకర్‌: ఎంపీ వైవీ
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘శుక్రవారం రెండోసారి నోటీసులు ఇచ్చాం. అప్పటికే అన్ని పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరాం. అందరూ సానుకూలంగా స్పందించ డమే కాకుండా స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం ప్రస్తావించినప్పుడు 100 మందికి పైగా నిలబడ్డారు. అయినా సభ సజావుగా లేదంటూ అనుమతించలేదు. ఎన్డీఏ ప్రభు త్వం, స్పీకర్‌ ఏపీ ప్రజల గొంతునొక్కుతున్నా రు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా సభ సజా వుగా జరిగేలా చూడాలి. అన్ని పార్టీలు సాను కూలంగా స్పందిస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.

చర్చకు వస్తే అన్యాయాన్ని చెప్పవచ్చు: పీవీ మిథున్‌రెడ్డి
ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశం దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల న్న డిమాండ్‌పై పడేలా ఈ తీర్మానం ద్వారా చేయగలిగాం. తీర్మానం చర్చకు వస్తే మనకు జరిగిన అన్యాయం చెప్పుకొనే వీలుంటుంది. మేం ఐదుగురం ప్రభుత్వాన్ని  పడగొట్టగలుగు తామని చెప్పడంలేదు. హోదా డిమాండ్‌ వైపు దేశం చూస్తోందంటే మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ పోరాటం చేయడం, మేం పార్లమెంటులో పోరాటం చేయడం వల్లే. మేం ఐదుగురమే ఐనా ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశానికి చాటగలిగాం. ఇది వైఎస్సార్‌సీపీ విజయమే. అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే ఈరోజు ఇంత అటెన్షన్‌ వచ్చేదా ’ అని ప్రశ్నించారు. 

ఊసరవెల్లిలా చంద్రబాబు: విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘మేం మా కార్యాచరణ మేరకు నాలుగేళ్లుగా పోరా టం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానం పెడతామ న్నాం. పెట్టాం. శుక్రవారం ఉదయం వరకు టీడీపీ కేంద్రంపై విశ్వాసాన్ని ప్రకటించింది. మా పోరాటానికి మద్దతు తెలపకపోవడమే కాకుండా హేళన చేసింది. బాబు ఊసర వెల్లిలా రంగులు మారుస్తున్నారు. ప్యాకేజీ కావాలని అడిగారు. ఇప్పుడు ప్రజల ఆగ్రహంతో మళ్లీ హోదా కావాలంటున్నారు..’ అని అన్నారు.

ఎందుకు ఓట్లేయించుకున్నారు: వెలగపల్లి
ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదాను హేళన చేసిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల దృష్టితో మళ్లీ హోదా అంటోంది. నాలుగేళ్లుగా ఏం చేసింది? బీజేపీని కూడా అడుగుతున్నాం.. ఎందుకు ఆరోజు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు ఎందుకు వేయించుకున్నారు. ఎందుకు ఒత్తిడి తేలేదని టీడీపీని అడుగుతున్నాం. అవిశ్వాసం మొట్టమొదటిసారిగా పెట్టింది వైఎస్సార్‌ సీపీనే. అంతతేలిగ్గా మేం వదిలిపెట్టం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వల్లే ఈ పోరాటం ముందుకుసాగింది..’ అని పేర్కొన్నారు.



టీడీపీ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారు: అవినాశ్‌రెడ్డి
ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మొదట వైఎస్సార్‌సీపీ ఇచ్చే తీర్మానానికి మద్దతు చెబుతామన్న టీడీపీ మళ్లీ శుక్రవారం మాటమార్చింది. మాకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు దక్కుతోందని గమనించి, వైఎస్‌ జగన్‌కు జాతీయ రాజకీయాల్లో మంచి పేరొస్తోందని ఆయన అభద్రతకు గురయ్యారు. అప్పటికప్పుడు ఎన్డీయేనుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఉదయం నోటీసులు ఇచ్చారు. అర్దగంటలో మద్దతు కూడగట్టామని వాళ్లు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా డ్రామాలు పక్కనపెట్టి చిత్తశుద్ధితో రావాలి. మేం రాజీనామాలకు సిద్ధం.. మీరు కూడా  సిద్ధం కండి’ అని పేర్కొన్నారు.

చర్చకు సిద్ధం: హోం మంత్రి 
స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చిన విషయాన్ని ప్రస్తావించక ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లా డారు. ‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావు గా సాగడం లేదు. ఏ అంశంపైన అయినా, ఏ సభ్యుడు లేవనెత్తినా దానిపై పూర్తిగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారపక్షం తరఫున చెబుతున్నా. కొందరు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఈ తీర్మానంపై చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. సభ్యులంతా సహకరించాలని కోరుతున్నా. ఈ తీర్మానంపై చర్చ జరిగేందుకు సహకరించండి’ అని అన్ని పక్షాలను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement