సాక్షి, ఏలూరు: ‘‘రాష్ట్రానికి ఏదో చేస్తారు కదాని 15కు 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారు పశ్చిమగోదావరి ప్రజలు. కానీ నాలుగేళ్లుగా ఇసుక నుంచి బొగ్గుదాకా, గుడి భూముల నుంచి గుడిలో లింగం దాకా అన్నింటినీ మింగేస్తూ చంద్రబాబు జనం గుండెల్లో గునపాలు దింపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు తొలి అడుగు పడింది ఈ జిల్లాలోనే. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిచేశాడు. ఈ జిల్లా నుంచే దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేసుకున్నారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్లు, మంత్రుల నుంచి చినబాబు దాకా అంతా లంచాలమయం. ఈ దొంగలబండికి నాయకుడు పెదబాబైన చంద్రబాబు నాయుడు’’ అని వైఎస్ జగన్ అన్నారు. 161వరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే బుజ్జి.. భూముల్ని బజ్జీల్లా తింటున్నాడు: యథా చంద్రబాబు.. తథా టీడీపీ ఎమ్మెల్యేలు అన్నట్లు సాగుతున్నది వ్యవహారం. చింతమనేనితోపాటు మరో ఎమ్మెల్యే శేషారావు గోదావరి గుండెల్ని పిండుతూ ఇసుక దండుకుంటున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి.. భూములను బజ్జీల మాదిరి తింటున్నాడు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని ఎమ్మెల్యే చితమనేని జుట్టుపట్టుకుని లాక్కెళ్లాడు. అలాంటివాడిని పోలీస్ స్టేషన్‌లో పెట్టాల్సిందిపోయి, ముఖ్యమంత్రే పంచాయితీ చేశాడు. అలా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు తొలి అడుగులు పశ్చిమగోదావరి నుంచే పడ్డాయి. ఒక్క ఎమ్మార్వోనేకాదు ఫారెస్ట్ ఆఫీసర్లు, అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలను కూడా తిట్టి, కొట్టారు. చివరికి అడిషనల్ జిల్లా జడ్జిగారిపైనా దౌర్జన్యం చేశారు. అందుకుగానూ ఇక్కడి ఎమ్మెల్యేలకు సీఎం రేటింగ్స్‌లో మంచి మార్కులు ఇచ్చారు. 15 స్థానాల్లో టీడీపీని గెలిపించిన పశ్చిమగోదారి జిల్లా రుణాన్ని చంద్రబాబు ఈ విధంగా తీర్చుకుంటున్నాడు.
ఏలూరుకు వైఎస్సార్ ఎంతో చేశారు: దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో ఏలూరులో 12 వేల మందికి భూములు పంచారు. ప్రభుత్వం డబ్బుతో భూములు కొనిమరీ పేదలకు పంచారు. దాదాపు 5వేలకు పైగా ఇళ్లు కట్టించారు. అవన్నీ ఇక్కడి జనం ఇంకా మర్చిపోలేదు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కటంటే ఇక్క ఇల్లూ ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు తాగునీటి సమస్య పరిష్కారం కోసం వైఎస్సార్ ట్యాంకులు కట్టించారు. ఇవాళేమో నీళ్లులేని గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేదు. పాదయాత్ర చేస్తోన్న నా దగ్గరికి ఏలూరు కార్పొరేషన్ కార్మికులు వచ్చారు. అన్నా.. స్మార్ట్ సిటీ అంటున్నారుగానీ, ఐదు నెలలుగా జీతం ఇ‍్వడంలేదని గోడువెళ్లబోసుకున్నారు. రోడ్ల విస్తరణకోసం ఇల్లులు, దుకాణాలు తొలగించినప్పుడు పేదలకు అండగా నిలవాలన్న జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండాపోయింది..
బాబు చేతిలో మోసపోనివారు లేరు: మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయంటున్నారు. ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతున్నా... ఈ నాలుగేళ్ల పాలనలో మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నా. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేసేవాళ్లు నాయకులు కావాలా అని అడుగుతున్నా. ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. బెల్టు షాపులు తీసేస్తానని బోలెడు వాగ్ధానాలు చేసిన చంద్రబాబు.. అందులో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఒకప్పుడు రేషన్ షాపులో 185 రూపాయలకే అన్ని నిత్యావసరాలు వచ్చేవి. ఇవాళ రేషన్ కార్డులనే ఎత్తేసే పరిస్థితి. పెట్రోల్, డీజిల్‌పై విపరీతంగా పన్నులు బాదుతున్నారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ టికెట్ల ధరలు అదుపులేకుండా ఉన్నాయి. బాబు చేతిలో మోసపోనివారంటూ ఎవరూలేరు. హామీలపై జనం నిలదీస్తారన్న భయంతోనే తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్ నుంచి గత ఎన్నికల మేనిఫెస్టోను తొలగించారు..
హోదాపై దారుణంగా మోసం చేశారు: రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ మీడియాను మేనేజ్ చేస్తూ నాలుగేళ్లుగా పాలనసాగిస్తున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలోనైతే ప్రజల్ని దారుణంగా మోసం చేశాడు. ఎన్నికలకు ముందు హోదా 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని అన్నాడు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేశాడు. ఆ నాలుగేళ్ల కాపురంలో ఏనాడూ ప్రత్యేక హోదా గుర్తుకురాకపోగా, దాన్ని అవమానించి, చులకన చేశాడు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తే.. చంద్రబాబే అడ్డుకున్నాడు. మొన్నటికి మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజు వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే హోదా వచ్చేదికాదా.
బాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి..: హోదా విషయంలో చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయి. 30 కోట్లు ఖర్చుపెట్టి ఒక్కపూట నిరాహార దీక్ష చేస్తాడు. ఆయనేమో బాబా మాదిరి కూర్చుంటే అందరూ వెళ్లి కాళ్లు మొక్కాలట. చివరికి ఎన్డీఆర్ డూప్‌ను పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు చూపించారు. పద్మభూషణ్, ఆస్కార్ అవార్డులిచ్చేవాళ్లు చంద్రబాబును గనుక చూసుంటే ఈయనకే ఉత్తమ విలన్ అవార్డిచ్చేవాళ్లు. విశాఖలో సదస్సులు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతాడు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాళ్లకు బుద్ధిచెప్పాలి. పొరపాటున క్షమిస్తే రేపు ఇంటికో కేజీ బంగారం, కారు ఇస్తానని ముందుకొస్తాడు.
మన ప్రభుత్వంలో ఇది చేస్తాం..: నాలుగేళ్ల అన్యాయపు పాలనకు చరమగీతం పాడుతూ రేప్పొద్దున మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో ఏయే వర్గాలకు ఏమేం చెయ్యబోతున్నామో నవరత్నాల ద్వారా తెలిపాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఎన్ని లక్షల ఫీజైనా చెల్లించడమేకాదు హాస్టల్, మెస్ ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేలు ఇస్తాం. బిడ్డల్ని బడులకు పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు అందజేస్తాం. ఇంకా అన్ని వర్గాలకు ఆమేరకు మేలు జరిగేలా పథకాలను అమలుచేస్తాం..’’ అని వైఎస్ జగన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment