అధికార పక్షంలో గుబులు పుట్టిస్తున్న సునామీ ఇది.. రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపరుస్తున్న జనసాగరమిది.. పాదయాత్ర సాగిన మార్గంలో మిద్దెలు, మేడలు, చెట్లు, గుట్టలు, లారీలు, బస్సులు.. అంతటా జనమే జనం. జగనన్నొచ్చారంటూ.. ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి జనం పోటీపడ్డారు.
ప్రభం‘జనాన్ని’ చూసి ఆశ్చర్యపోతున్న విశ్లేషకులు
అడుగడుగునా జనం.. ఇసుకేస్తే రాలనంత ప్రభంజనం.. పల్లె, పట్నమన్న తేడా లేదు. కొండలు, గుట్టలు, మట్టి రోడ్లు, బురద ప్రాంతాలు.. ఎక్కడికెళ్లినా జనప్రవాహమే. ఊళ్లకు ఊళ్లు తరలివస్తున్నాయి. ఇడుపులపాయ మొదలుకొని విశాఖ జిల్లా వరకూ ఇదే స్పందన. ఎక్కడికక్కడ పండుగ వాతావరణమే..
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందనిది. రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపరుస్తున్న జనసాగరమిది. ఒకటి కాదు రెండు కాదు.. 3 వేల కిలోమీటర్లకు పైగా అలుపెరగని బాటసారి సాగిస్తున్న పాదయాత్ర ప్రతీ అడుగులోనూ ఇదే సన్నివేశం. అధికార పక్షంలో గుబులు పుట్టిస్తున్న ఈ జనసునామీని అంచనా వేయడానికి, అధ్యయనం చేయడానికి రాజకీయ సర్వే బృందాలు నడుం బిగించాయి. ఎందుకొస్తున్నారీ జనం? ఓ నేత కోసం ఈ స్థాయిలో జన ప్రవాహమేంటి? అన్నది ఇప్పుడు అన్ని వర్గాలను అలోచింపజేస్తున్న ప్రశ్న. ప్రజలను రప్పించే ప్రయత్నాల్లేవు.. ఎవరికి వారే నిర్వాహకులు.. ఒకొక్కరూ ఒక్కో సైనికుడిలా పనిచేస్తున్నారు. జగన్ వ్యక్తిగత సిబ్బందిగానీ, ప్రభుత్వ భద్రతా వ్యవస్థగానీ ఎగిసిపడే జనాభిమానాన్ని అదుపుచేయలేని పరిస్థితి కన్పిస్తోంది.
ఊరంతా సంక్రాంతి
పాదయాత్ర సాగే ప్రాంతాల్లో జగన్‌ను స్వాగతించడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఏ ఊరికావూరు ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. పండగొచ్చినట్టు మహిళలు పట్టు చీరలు కట్టుకొస్తున్నారు. గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. వాకిళ్లను రంగవల్లులతో అలంకరిస్తున్నారు. సంక్రాంతి రోజుల్లో జరిగే ముగ్గుల పోటీల వాతావరణం జగన్ పాదయాత్ర సాగే గ్రామాల్లో ఆవిష్కృతమవుతోంది. తోరణాలు కట్టే వాళ్లు కొందరైతే.. దారిపొడవున పూలబాట వేసేవారు మరికొందరు. విశాఖ జిల్లా ఏటికొప్పాకలో చెక్కబొమ్మలతో స్వాగతం పలికారు. నర్సీపట్నంలో అల్లూరి సంధించిన విల్లు బాణాలతో ఎదురేగారు. చక్కెర పండించే రైతులు చెరకుగడలతో స్వాగతించారు.
ఎండైనా.. వానైనా.. జనమే జనం
జగన్ పాదయాత్ర మూడు కాలాల్లోనూ సాగింది. మండే ఎండలో.. గజగజ వణికించే చలిలో.. జోరు వర్షంలో.. ఇలా కాలం ఏదైతేనేం? జననేతతోపాటు జనం కూడా వాటిని లెక్కజేయలేదు. జగన్ అడుగులో అడుగేశారు. మండు వేసవిలోనూ జనకెరటం ఉప్పెనలా ఎగసిపడింది. చుర్రున కాళ్లు కాలుతున్నా చంటిపిల్లలను ఎత్తుకొని మరీ మహిళలొచ్చారు. జగన్ కోసం క్యూలు కట్టి మరీ నిరీక్షించారు. వృద్ధులు తుండుగుడ్డలను నెత్తికి చుట్టుకుని, పొన్నుగర్ర పోటేస్తూ రావడం విశేషం. మంచుకురిసే పొలాల్లో జగన్ కోసం పరుగులు పెట్టిన రైతు కూలీలు.. దుప్పట్లు కప్పుకుని ‘మనవడొస్తున్నాడు.. చూడాల్సిందే’ అంటూ రోడ్లపై పడిగాపులు గాసిన వృద్ధులు.. రాజన్న బిడ్డను కలిసి ముచ్చటిస్తే చాలనే ధోరణి ప్రజల్లో స్పష్టంగా కన్పించింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో తరచూ జోరున వర్షం.. రోడ్లన్నీ బురదమయం.. నడవడం కూడా కష్టమయ్యేది. పాదయాత్ర శిబిరం చుట్టూ బురద పేరుకుపోయేది. అభిమానులు అవేమీ పట్టించుకోలేదు. జగన్ శిబిరం వద్దకు వెళ్లాలన్నదే వారి ఏకైక లక్ష్యం. దాంతో భారీగా తరలివచ్చేవారు. తడిసిపోతూ పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూసి పరవశించారు. అభిమాన నేతతో కలిసి నడుస్తూ కష్టాలు చెప్పుకున్నారు. సంతోషాన్ని పంచుకున్నారు. వర్షంతో తడిసి ముద్దవుతూనే ఆయన సభలకు పెద్దఎత్తున హాజరయ్యారు.
అంతులేని అభిమానం..
పొలాల మధ్యే శిబిరంలో ఉంటున్న జగన్‌ను చూసేందుకు జనం అన్ని ప్రాంతాల్లోనూ పోటీపడ్డారు. ఆయన ఉదయం టెంట్ నుంచి బయటకొచ్చే సమయానికి ముందే అక్కడకు వేలమంది చేరుకుంటున్నారు. టెంట్ నుంచి ఆయన బయటకొచ్చింది మొదలు ప్రజల ఆనందానికి హద్దుల్లేవు. ‘వస్తున్నాడు.. అన్నొస్తున్నాడు’ అంటూ పరుగులు పెట్టడం సర్వసాధారణమైంది. మధ్యాహ్నం భోజన విరామానికి వెళ్లే వరకూ వేలమంది జగన్‌తో కలిసి నడుస్తున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. హారతులు పడుతున్నారు. తమ నేత వద్దకు చొచ్చుకు వెళ్లి కరచాలనం చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ‘అన్న మనల్ని పిలుస్తాడనే ’ విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. సభలు జరిగేప్పుడు వేదిక పరిసర ప్రాంతం జన ప్రవాహంతో కిక్కిరిసిపోతోంది. సమీపంలోని గోడలు, మిద్దెలు, చెట్లు, కరెంట్ స్తంభాలు అన్నీ జనంతో నిండిపోతున్నాయి. విశాఖపట్నంలో ముస్లిం మైనార్టీల సదస్సు రోజు భారీ వర్షంతో వేదిక ప్రాంగణం జలమయమైపోయింది. అయినా, ఏ ఒక్కరూ బయటకు వెళ్లలేదు. అలాగే.. యలమంచలిలో జరిగిన బహిరంగ సభనూ వర్షం ముంచెత్తినా జనం లెక్కచేయలేదు. చివరికి.. జగన్ రాత్రి బసకు వెళ్లిన తర్వాత కూడా అభిమానులు పొద్దుపోయే వరకూ అక్కడే ఉంటున్నారు.
ప్రతీసభ ఓ జన సునామీనే
మరికొద్ది గంటల్లో 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించబోతున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలన్నీ జన సునామీలను తలపించాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ఈ పాదయాత్రలో ఆయన అడుగుపెట్టిన ప్రతీ ఊరూ నేల ఈనిందా అన్నట్లుగా మారింది. ఎక్కడ సభలు జరిగినా ఓ జాతరను తలపించే రీతిలో బంపర్‌హిట్ అయ్యాయి. జగనన్న తమ ఊరికి వస్తున్నాడనే ఆనందోత్సాహాలు స్థానికుల్లో ప్రతిచోటా వెల్లివిరిశాయి. 11 జిల్లాల్లో 106 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
పల్లెలు, పట్టణాలు, కూడళ్లు అనే తేడా లేకుండా పెద్ద నగరాలు మొదలు పట్టణాలు, మండల కేంద్రాల వరకు జగన్ ఎక్కడ సభలు పెడితే అక్కడ జనం వెల్లువెత్తారు. ఇడుపులపాయ నుంచి విశాఖ వరకూ ఒకదానికొకటి ఏ మాత్రం తీసిపోకుండా సభలు జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ వారథి నుంచి విజయవాడ నగరంలోకి ప్రవేశించినప్పుడు, పశ్చిమ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోకి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పైనుంచి వచ్చినప్పుడు ఆ రెండు వంతెనలూ జనవారథులుగా మారాయి. ఇక సభలకు భారీ సంఖ్యలో జనం రావడం ఒక ఎత్తయితే.. జగన్ ప్రసంగాలకు వారి నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన మరో ఎత్తు. టీడీపీ పరిపాలనపై జగన్ సునిశిత విమర్శలు చేసినపుడు వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు.
Comments
Please login to add a commentAdd a comment