శుక్రవారం కడప పెద్ద దర్గాలో చాదర్ సమర్పిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి కడప/సాక్షి, చిత్తూరు: దారిపొడవునా జనసంద్రం వెల్లువెత్తింది.. ఊరువాడా ఏకమయ్యాయి. ‘జయహో జగన్’, ‘సీఎం.. సీఎం’ అంటూ ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నినాదాలతో తిరుపతి–కడప–పులివెందుల రహదారి దద్దరిల్లింది. ప్రజాసంకల్ప యాత్రను దిగ్విజయంగా ముగించుకుని గురువారం తిరుమలేశుడి ఆశీస్సులు పొందిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుమందు తిరుపతిలో ఉదయం ఆయన్ను పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కలిసి సంకల్పయాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బయలుదేరగా ఎక్కడికక్కడ ఆయనకు దారిపొడవునా జనాలు బ్రహ్మరథం పట్టారు. పూలు చల్లుతూ, హారతులు ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనను చూసేందుకు, కలిసేందుకు బారులు తీరారు. ఆయనను చూసిన ఆనందంతో టపాసులు పేల్చారు. పోటెత్తిన జనాలందరికీ వాహనంపై నుంచి చిరునవ్వుతో వైఎస్ జగన్ అభివాదం చేశారు. కాన్వాయ్ ఆపుతూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. వైఎస్సార్, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కుక్కలదొడ్డి వద్ద రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. రోడ్ల వెంట వైఎస్సార్‌సీపీ జెండా రంగులతో కూడిన బెలూన్లను స్వాగత తోరణాలుగా కట్టి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైల్వేకోడూరు నుంచి రాజంపేటకు రాగానే పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు హారతులు పట్టారు. అక్కడి నుంచి కడప జేఎంజే కళాశాలకు చేరుకోగానే కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాష, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. ప్రజలు వెల్లువలా తరలిరావడంతో కడప నుంచి వేంపల్లె మీదుగా పులివెందులకు చేరుకోవడానికి రాత్రి 9 గంటలైంది.
రైల్వేకోడూరు పట్టణంలో స్వాగతం పలుకుతున్న ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
చంద్రబాబు చర్మం చాలా మందం
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలు, చేసేవన్నీ మోసాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవాటిలో పొరపాటున కూడా నిజాలు ఉండవని అన్నారు. చంద్రబాబు చర్మం చాలా మందమని, ఎన్ని నిరసనలు చేసినా ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదని ధ్వజమెత్తారు. రైల్వేకోడూరులో వైఎస్సార్ ఉద్యానవన కళాశాల విద్యార్థులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఉద్యానవన శాఖలో అన్ని రకాల ఉద్యోగాలు అర్హులైన ఉద్యాన కోర్సుల విద్యార్థులకే అందించాలని కోరుతూ 15 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా సర్కార్ స్పందించడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి అన్ని సమస్యలు తెలుసుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంటింటికీ ఉద్యోగమిస్తానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో దారుణమైన మోసం తప్ప ప్రజలకు న్యాయం జరగదని అన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లో గ్రామ సచివాలయాల ద్వారా రైతు సంక్షేమానికి ఉపయోగపడే అన్ని పోస్టులు భర్తీ చేస్తామని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.50 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామన్నారు. ఎన్ని నిరసనలు చేసినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోదని.. అనవసరంగా చదువులు పాడుచేసుకోకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. వైఎస్ జగన్ వెంట రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలు ఉన్నారు.
రైల్వేకోడూరు సెంటర్‌లో వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయను సందర్శిస్తారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. తొలుత ఆయన శనివారం ఉదయం 7.30 గంటలకు పులివెందుల ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి, పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్‌రెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలకనున్నారు. అక్కడినుంచి జగన్ పూలంగళ్ల సర్కిల్, శ్రీనివాస హాలు రోడ్డు మీదుగా స్థానిక సీఎస్‌ఐ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతమ్మ ఇతర కుటుంబసభ్యులతో కలసి నివాళులర్పిస్తారు.
రాజంపేట శివార్లలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు..
కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న కడప పెద్ద దర్గాను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ముందుగా పూల చాదర్‌ను గురువుల మజార్‌కు సమర్పించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ఫాతెహా నిర్వహించారు. దర్గా సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పెద్దదర్గాలో ప్రార్థనలు ముగిసిన అనంతరం ఆవరణలోని పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. ఈ ప్రార్థనల్లో వైఎస్ జగన్‌తోపాటు కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ నేతలు సురేష్‌బాబు, ప్రసన్నకుమార్‌రెడ్డి, రెహ్మాన్ తదితరులు ఉన్నారు.
కడప జేఎంజే కళాశాల వద్ద జగన్‌కు ద్విచక్ర వాహనాలపై స్వాగతం పలుకుతున్న విద్యార్థి సంఘ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment