
సాక్షి, అమరావతి : బాబుగారు తన సెక్రటరీలనూ, నమ్మకమైన అనుచరులనూ, క్లోజ్‌గా ఉండే కొందరు కొలీగ్స్‌ను పిలిపించే సీక్రెట్‌గా ఓ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. శిఖరాగ్ర సమావేశం కాబట్టి మొదట గాంధీకొండ మీదే ఏర్పాటు చేద్దామనుకున్నారు గానీ.. టైమ్ లేకపోవడంతో కాన్ఫరెన్స్ హాలుకే కన్‌ఫైన్ అయ్యారు.
‘‘ఉద్వేగంతో ఊగిపోతూ ఏదో ఎమోషన్‌లో హైదరాబాద్ లాంటివి 20 నగరాలు కట్టేస్తానన్నాను. కాబట్టి అర్జెంట్‌గా అవన్నీ ఎలా కట్టేయాలో సలహాలివ్వండి’’ అని అడిగారు.
ఎంత అర్జెంట్‌గానైనా ఒకేసారి 20 నగరాలు కట్టడమంటే మాటలా! ఏదో ఒకటీ, రెండు నగరాలంటే ఫర్లేదుగానీ.. 20 నగరాలు ఎలా అని వాళ్ల మనసుల్లో అనిపించింది. అదెంత అసాధ్యమో గుర్తొచ్చి అందరూ నిశ్శబ్ధంగా ఉండిపోయారు.
‘‘మీ చిన్నప్పటి రోజుల్లో అంబడిపూడి పుస్తకాలని బోల్డన్ని ఉండేవన్నారు కదా నాన్నారూ.. ‘ముప్పై రోజుల్లో కొంకణీ నేర్చుకోవడం ఎలా?’, ‘ఉపన్యాసం ఇవ్వడం ఎలా?’, ‘మీరు కోటీశ్వరులైపోండి’ లాంటివి అనేకం దొరికేవని మీరోసారి చెప్పారు కదా. అలాంటి పాత పుస్తకాలు ఎక్కడైనా ఫుట్‌పాత్‌ల మీద దొరుకుతున్నాయేమో చూడమని పురమాయిద్దాం. ‘30 రోజుల్లో 20 నగరాలు కట్టడం ఎలా?’ లాంటి పుస్తకాలేవైనా దొరికితే ఇక మన పని అయిపోయినట్టే. ఎలాగూ వెతుకుతున్నారు కాబట్టి.. పనిలో పనిగా ‘పోర్టులను తరలించకుండా ఆపడం ఎలా?’ లాంటివి కూడా అంబడిపూడి సిరీస్‌లో ఎక్కడైనా దొరుకుతాయేమో చూడమని కూడా చెబ్దాం నాన్నారూ మనవాళ్లకు’’ సలహా ఇచ్చాడు లోకేశం.
‘‘బావా.. అలాగే.. ‘నోరూ, చెయ్యీ అదుపు చేసుకోవడం ఎలా’ లాంటి పుస్తకం కూడా ఏదైనా దొరికితే చూడమను బావా. స్పీచులప్పుడు నేను కొడుతున్న కొటేషన్లన్నీ పాతబడిపోయాయి. ‘సారేజహా.. బుల్ బుల్.. బుల్ బుల్’’ లాంటి కొటేషన్ల పుస్తకాలు కూడా దొరికేతే బాగుణ్ణు’’ అల్లుడిగారి సలహాకు కొనసాగింపుగా మరో సలహా ఇచ్చారు బావమరిదిగారు.
ఇవేమీ వర్కవుట్ అయ్యేలా లేవని కాస్తంత డొక్కశుద్ధీ, చదువూ సంధ్యా ఉన్న ఒక సెక్రటరీని సలహా అడిగారు బాబుగారు.
‘‘సార్.. దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలు 20 కట్టడం అంటే మాటలు కాదు. అందునా ఇంత అర్జెంటుగా. అందుకని ఓ పని చేద్దాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 20 నగరాలను సెలక్ట్ చేద్దాం. ఆ నగరాల్లోని ఏరియా పేర్లకు దగ్గరగా ఉన్న హైదరాబాద్ కాలనీల పేర్లు పెడదాం’’
అన్నాడా సెక్రటరీ.
‘‘అదెలా?’’
‘‘ఉదాహరణకు ఇప్పుడు మన విజయవాడనే తీసుకుందాం. లబ్బీపేట పేరును ఎల్‌బీనగర్ అని మారుద్దాం. దుర్గాపురం ఏరియాను దుర్గంచెరువు అందాం. కామకోటినగర్ పేరులో మొదటిదీ, చివరదీ కొట్టేసి.. సింపుల్‌గా ‘కోఠి’ అందాం. కొండపల్లిని కూకట్‌పల్లి అనీ, ఆజంపూడిని ఆజమాబాద్ అని, ఏసీ కంపెనీని ఏసీగార్డ్స్ అని, గన్నవరాన్ని గండిపేట అని.. అన్నీ ఇలా చేంజింగ్ చేసేద్దాం సార్. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉంది కాబట్టి దానిపేరు శంషాబాద్ అని మారుద్దాం. ఇక్కడ మనకు మరో సౌలభ్యం కూడా ఉంది సార్. ఇబ్రహీంపట్నం, మారుతీనగర్, హౌజింగ్‌బోర్డు కాలనీ లాంటి వాటిని మార్చక్కర్లేదు. ఇదేవిధంగా... ఆల్రెడీ మనకున్న 20 పట్టణాల్లోనూ అన్ని పేటలూ, బస్తీలు, కాలనీల పేర్లను ఇలా మార్చేస్తే చాలు. దీనికి పెద్దగా టైమ్ కూడా పట్టదు సార్. పట్టణానికి ఒకటి చొప్పున 20 జీవోలు ఇస్తే సరిపోతుంది’’ సలహా ఇచ్చాడు బాబుగారి వర్కింగ్ స్టైల్ మీద పూర్తిగా అవగాహన ఉన్న సెక్రటరీ. ఈ సలహా పట్ల అందరూ ఆసక్తి కనబర్చారు.
‘‘అవును.. దీనికి తోడు ఇంకో పని చేయండి. ఒక ప్రపంచపటం కొనేయండి. ఈ 20 నగరాలనూ దాన్లో రెడ్ ఇంక్‌తో మార్క్ చేసి, వీటన్నింటినీ నేనే ప్రపంచపటంలో పెట్టానంటూ ఊదరగొట్టమని మన గొట్టాలవారికీ, ఆస్థాన న్యూస్ పేపర్ల వారికి చెప్పండి. ఇంత కొద్ది టైమ్‌లోనే ఇన్ని నగరాలు కట్టినందుకు కృతజ్ఞతగా ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ హోర్డింగులూ, బోర్డులూ ఆయా నగరాల్లో ఏర్పాటు చేయండి’’ అంటూ ఆదేశాలు జారీచేసి, మీటింగ్ ముగించారు బాబుగారు.
Comments
Please login to add a commentAdd a comment