
రాజ్‌నాథ్ సింగ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్ వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, ఈ విషయంలో దాయాది పాకిస్థాన్ కొంత చొరవ చూపి.. చొరబాటు యత్నాలను ఆపడం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యను చేపట్టడం ద్వారా తన ఉద్దేశాన్ని చాటాలని ఆయన సూచించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు చేపట్టిన మధ్యవర్తుల నియామకం.. అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదని ఆయన అంగీకరించారు. కశ్మీర్‌లో శాంతిస్థాపనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్కడ పరిస్థితులు శాంతియుతంగా కొనసాగితే.. రంజాన్ తర్వాత కూడా కాల్పుల విరమణను కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
‘పాకిస్థాన్ చర్చలకు సిద్ధపడితే.. మేం ఎందుకు మాట్లాడం? పొరుగు దేశంతో సత్సంబంధాలు కావాలని మేం కోరుకుంటున్నాం. కానీ, పొరుగుదేశమే కొంత చొరవ చూపాల్సిన అవసరముంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదులు చొరబడేందుకు వీలు కల్పిస్తోంది. పాకిస్థాన్ తన విధానాలను మార్చుకోవడం లేదు. కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు పాక్ తన పద్ధతి మార్చుకోక తప్పదు’ అని రాజ్‌నాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment