
ముంబై: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శల వర్షం గుప్పించారు. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఇమ్రాన్ ఖాన్ కార్టూనిస్టులను బాగా పని కల్పిస్తున్నారని ఆయన శనివారం ముంబైలో ఎద్దేవా చేశారు. దేశ పశ్చిమ తీర ప్రాంతాల్లో 26/11 తరహా దాడులు నిర్వహించాలని కొన్ని శక్తులు తలపోస్తున్నాయని, కానీ వాళ్ల ఆటలు ఏమాత్రం సాగవని స్పష్టం చేశారు.
ముంబైలో శనివారం స్కార్‌పీన్ తరహా జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ, పీ–17ఏ ఫ్రిజెట్స్‌తో కూడిన తొలి యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ నీల్‌గిరిలను వేర్వేరు కార్యక్రమాల్లో జాతికి అంకితం చేసిన ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌పై ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను ప్రపంచం మొత్తం హర్షిస్తూంటే పాక్ ప్రధాని మాత్రం ఇంటింటికి తిరుగుతూ హాస్యం పండిస్తున్నారన్నారు. ఐఎన్‌ఎస్ ఖండేరీ రాకతో నావికాదళ శక్తిసామర్థ్యాలు, శత్రువుపై దాడి చేయగల సామర్థ్యం మరింత పెరిగిందన్న విషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని అన్నారు. ఐఎన్‌ఎస్ ఖండేరీ గురించి మాట్లాడుతూ జలాంతర్గాములను స్వయంగా తయారు చేసుకోగల అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి కావడం ఎంతైనా గర్వకారణమని అన్నారు.
ఐఎన్‌ఎస్ ఖండేరీ ప్రత్యేకతలు..
►భారత్ సొంతంగా నిర్మించుకున్న కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో రెండోది.
►ఐఎన్‌ఎస్ కల్వరి 2017 డిసెంబరు నుంచి పనిచేస్తోంది.
►మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించిన ఖండేరీ అతితక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది.
►డీజిల్, విద్యుత్తు రెండింటినీ వాడుకుని పని చేయగలదు.
►ఏకకాలంలో గంటకు 20 నాటికల్ మైళ్ల వేగంతో ఆరు క్షిపణులను ప్రయోగించవచ్చు.
►మొత్తం 36 మంది సిబ్బంది ప్రయాణించవచ్చు.
►సుమారు 45 రోజులపాటు ఏకధాటిగా సముద్రంలో ఉండగలగడం దీని ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment