దేశ చరిత్రలో 1972 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. పాకిస్తాన్‌తో యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్‌ను విముక్తి చేయడంలో ఆనాటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి గొప్ప పేరు వచ్చింది. దేశం అంతటా ఇందిర ప్రభంజనం వీచింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లతో విజయ డంకా మోగించింది. ఉమ్మడి ఏపీలో మొత్తం 17 మంది కాంగ్రెస్ నేతలు ఎకగ్రీవంగా ఎన్నికైతే, తెలంగాణ నుంచి ఏడుగురు అలా విజయం సాధించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏకగ్రీవంగా గెలిచిన ప్రముఖులలో సోం భూపాల్ (అమరచింత), కళ్యాణి రామచంద్రరావు (మక్తల్), ఎమ్.మాణిక్ రావు (తాండూరు), గడ్డెన్న(ముధోల్), పి.నర్సారెడ్డి (నిర్మల్), కోదాటి రాజమల్లు (చిన్నూరు), నూకల రామచంద్రారెడ్డి (డోర్నకల్)ఉన్నారు. తెలంగాణలో మొత్తం 101 సీట్లలో, అందులో 78 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సీపీఐకి మూడు, సీపీఎం ఒకటి, సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు 18 మంది గెలిచారు. కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు ఇండిపెండెంట్లు గెలుచుకోవడం విశేషం. సామాజికవర్గాల వారీగా చూస్తే ఈ సారి రెడ్ల సంఖ్య కొద్దిగా తగ్గినా వారిదే పైచేయి అని చెప్పాలి. 29 మంది రెడ్డి సామాజికవర్గం నేతలు గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి 23 మంది ఉన్నారు. మిగిలిన సామాజికవర్గాలలో బీసీలు 19 మంది నెగ్గగా, ఎస్సీలు 17 మంది, 10 మంది వెలమ వర్గం వారు నెగ్గారు.
బీసీ వర్గాల విశ్లేషణ
మున్నూరుకాపు నుంచి 5, గౌడ 3, యాదవులు 3, పద్మశాలి ఇద్దరు, కురుబ ఇద్దరు, ముదిరాజ్ ఇద్దరు, విశ్వబ్రాహ్మణ ఒకరు, మేరు ఒకరు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. మొత్తం బీసీలు ఇలా 19 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.
ఇందిర ప్రభంజనంలో రెడ్ల హవా...
ఇందిరాగాంధీ ప్రభంజనంలో కూడా రెడ్డి నేతలు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. అయితే వారిలో అత్యధికం కాంగ్రెస్ నుంచే గెలిచారు. 23 మంది కాంగ్రెస్ తరపున గెలిస్తే ఒకరే సీపీఐ పక్షాన గెలిచారు. ఐదుగురు ఇండిపెండెంట్లు నెగ్గారు. పి.నరసారెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, టి.అంజయ్య, ఎస్.జైపాల్ రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభృతులు గెలుపొందినవారిలో ఉన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి రెడ్లు గెలుపొందారు. కాగా బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్టు ప్రముఖుడుగా ఉన్నారు.
వెలమ నేతలు పది మంది
వెలమ నేతలు అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి విజయం సాదించారు. అక్కడి నుంచి నలుగురు గెలిచారు. వెలమ ప్రముఖులలో జలగం వెంగళరావు, జేవీ నరసింగరావు, జువ్వాది చొక్కరావు తదితరులు ఉన్నారు. ఇతర నేతలలో జగపతి రావు, చెన్నమనేని సత్యనారాయణరావు, జోగినపల్లి దామోదరరావు, పురుషోత్తం రావు తదితరులు ఉన్నారు.
ముస్లింలు ఏడుగురు...
ఈ ఎన్నికల్లో ముస్లిం నేతలు ఏడుగురు అసెంబ్లీకి వచ్చారు. హైదరాబాద్ పాతబస్తీపై మజ్లిస్ నేత సలావుద్దీన్ ఒవైసీ తన పట్టు కొనసాగించారు. ఒవైసీతో సహా ముగ్గురు ఇండిపెండెంట్లు పాతబస్తీ నుంచి గెలిచారు. సీపీఐ నుంచి సీనియర్ నేత రజబ్‌అలీ గెలుపొందగా కాంగ్రెస్ నుంచి మసూద్ అహ్మద్ , ఇబ్రహీం అలీ అన్సారీ వంటి ప్రముఖులు ఉన్నారు.
తగ్గిన బ్రాహ్మణుల ప్రాతినిధ్యం
ఈ ఎన్నికలకు వరకు వచ్చేసరికి బ్రాహ్మణ వర్గం నేతలు క్రమేపీ తగ్గిపోయారు. 1972లో కూడా గతంతో పోల్చితే బాగా తగ్గారు. తొమ్మిది మంది బ్రాహ్మణ నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వారిలో పీవీ నరసింహారావు, వి.రాజేశ్వరరావు, చకిలం శ్రీనివాసరావు, కరణం రామచంద్రరావు వంటివారు ఉన్నారు. కరణం రామచంద్రరావు ఇండిపెండెంటుగా నెగ్గారు. సీపీఐ నుంచి రామశర్మ గెలుపొందారు.
రిజర్వుడు సీట్లలో కాంగ్రెస్ హవా...
ఎస్సీ వర్గం రిజర్వుడ్ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిందని చెప్పాలి. 17 సీట్లలో 14 చోట్ల గెలిచింది. ఒకరు సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి నుంచి ,ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలిచారు. టీపీఎస్ తరపున ఈశ్వరిబాయి గెలిచారు. కాగా కాంగ్రెస్ ప్రముఖులు కోదాటిర రాజమల్లు, రాజనరసింహ, సుమిత్రాదేవి, పి.మహేంద్రనాద్ తదితరులు ఉన్నారు.
ఇతరులు...
ఇతర ప్రముఖులలో కమ్మ వర్గం నుంచి నలుగురు, గిరిజనులు నలుగురు, వైశ్యుడు ఒకరు, బలిజ ఒకరు విజయం సాధించారు. కమ్మ వర్గం నుంచి గెలిచినవారంతా కాంగ్రెస్ వారే. వారిలో టి.చంద్రశేఖరరెడ్డి(అలంపూర్) కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి చేకూరి కాశయ్య గెలుపొందారు. కాగా గిరిజనులు నలుగురు కాంగ్రెస్ వారే .వారిలో భీమ్‌రావు ప్రముఖుడు. వైశ్యవర్గం నుంచి వెంకటయ్య..కొడంగల్‌లో ఇండిపెండెంట్‌గా గెలవడం విశేషం. కాగా వనపర్తిలో బలిజ సామాజికవర్గానికి చెందిన అయ్యప్ప విజయం సాధించారు.
సామాజిక విశ్లేషణ
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment