అప్పట్లో జవహర్‌లాల్ నెహ్రూ.. ఆ మధ్య వీపీ సింగ్.. కాఫీ తాగడానికి, రాజకీయ కబుర్లు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చేవారు. బిగ్ బి అమితాబ్ కూడా కుర్రాడిగా ఉన్నప్పుడు సైకిల్ మీదొచ్చేవాడు. ఇప్పుడు.. 2019 సార్వత్రిక ఎన్నికల సంగతులు మాట్లాడుకోవడానికి రిక్షా కార్మికుడు, లాయర్లు, జర్నలిస్టులు, విద్యావంతులు ఇలా అన్ని రకాల వారు వస్తున్నారు. గంటల తరబడి కాఫీలు తాగుతూ రాజకీయాలపై చర్చిస్తున్నారు. అదే.. ఇండియన్ కాఫీ హౌస్. దేశంలో రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఉన్న ఈ కాఫీ హౌస్ ఇప్పటికీ వేడివేడి రాజకీయ వార్తలకు, చర్చలకు కేంద్రంగా భాసిల్లుతోంది. ఎత్తయిన సీలింగ్, ఆర్చితో చూడగానే చర్చిగా కనిపిస్తుంది ఈ కాఫీ హౌస్. 1957 నుంచి ఉన్న ఈ కాఫీ హౌస్ నగరవాసులందరీకీ సుపరిచితమే. కాలం మారినా, రాజకీయాలు మారుతున్నా, జనాల అభిరుచులు మారుతున్నా.. ఈ కాఫీహౌస్ మాత్రం మారలేదు. లోపల ఆనాటి ఇంటీరియర్ డెకరేషనే నేటికీ ఆకట్టుకుంటోంది.
కాఫీ, ఇతర తినుబండారాల రేట్లు కూడా ఎక్కువేం కాదు. కాఫీ హౌస్ కాబట్టి మొదట్లో ఇక్కడ టీ దొరికేది కాదు. కాలం మారినా కూడా ఇప్పటికీ ఇక్కడ టీకి చోటేలేదు. అలహాబాద్‌కు గుండెకాయనదగిన సివిల్ లైన్స్‌లో ఉన్న ఈ కాఫీహౌస్‌కు 45 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా వస్తున్న వారు కూడా ఉన్నారు. కొందరయితే కాఫీ హౌస్‌లో కొన్ని సీట్లను రిజర్వు చేసేసుకున్నారు. వారెప్పుడొచ్చినా అక్కడే కూర్చుంటారు. ఇక్కడకొచ్చే వారు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తుంటారు. వాదోపవాదాలు కూడా తీవ్రంగానే జరుగుతాయి. అయితే, గొడవలు మాత్రం జరగవు. ‘ఎవరెంత గట్టిగా వాదించుకున్నా చివరికి అంతా ప్రశాంతంగానే వెళ్లిపోతారు’ అన్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడి వస్తున ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ రిటైర్డ్ అధికారి అశోక్ యాదవ్.
‘అప్పట్లో నెహ్రూ, తర్వాత వీపీ సింగ్ మా కాఫీహౌస్‌లో కాఫీతాగి కాసేపు గడిపేవారు. అమితాబ్ బచ్చన్ కూడా సూపర్‌స్టార్ కాకముందు సైకిల్ మీద ఇక్కడికొచ్చేవాడు’ అంటూ ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు కాఫీ హౌస్ మేనేజర్ పీఆర్ పాండా. 45 ఏళ్లుగా ఇక్కడికి రోజూ వస్తున్నారు అవదేశ్ ద్వివేది. ‘ఇంతకు ముందు ఎన్ని చర్చలు జరిగినా ఎవరూ ఎదుటి వారిని నొప్పించేలా మాట్లాడేవారు కాదు. అదుపు తప్పకుండా వాదించుకునే వారు. ఇప్పుడలా కాదు. కుర్రాళ్లు ప్రతి దానికీ ఆవేశ పడిపోతున్నారు. తమ మాట కాదంటే చాలు ఉద్రేక పడిపోతున్నారు’ అన్నారాయన. అలాఅని ఎవరూ తమ అభిప్రాయాలను చెప్పడానికి భయపడరన్నారు. రాజకీయ నాయకులు కావాలనుకునే వాళ్లు ఇక్కడికి వస్తుంటారు. దేశ రాజకీయాలను తెలుసుకుంటుంటారు. ప్రతిపక్షాల వాళ్లు కూడా వస్తారు. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంటారు’ అంటూ ప్రస్తుత పరిస్థితిని వివరించారు పాండే.
Comments
Please login to add a commentAdd a comment