ఇదొక నకిలీ వార్తల ఫ్యాక్టరీ! | It Is A Fake News Factory | Sakshi
Sakshi News home page

ఇదొక నకిలీ వార్తల ఫ్యాక్టరీ!

Published Sat, Apr 13 2019 5:44 PM | Last Updated on Sat, Apr 13 2019 6:23 PM

It Is A Fake News Factory - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’. ఏడు సంవత్సరాల క్రితం ఏర్పాటయిన ‘ఫేస్‌బుక్‌’ గ్రూప్‌ ఇది. ఇందులో 29.45 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపులో ఉన్న కొంత మంది సభ్యులకు దాదాపు 600 ఇతర ఫేస్‌బుక్‌ పేజీలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌ మొత్తం మీద తమదే అతిపెద్ద గ్రూపుగా నిర్వాహకులు చెప్పుకుంటున్నారు. మానిష్‌ బన్సాల్, బసంత్‌ సేథియా అనే ఇద్దరు యువకులు 2012, ఫిబ్రవరి పదవ తేదీన ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. మానిష్‌ బన్సాల్‌ ‘న్యూస్‌ట్రెండ్‌’ (న్యూస్‌ట్రెండ్‌ ఫేస్‌బుక్‌కు 41 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు) అనే వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపలు కాగా, బసంత్‌ సేథియా వ్యాపారమే తన వృత్తని ప్రొఫైల్‌లో చెప్పుకున్నారు. ఈ గ్రూప్‌ నుంచి బసంత్‌ సేథియా ఇటీవల తప్పుకోగా, బన్సాల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్నారు.

ఈ గ్రూప్‌కు ముగ్గురు అడ్మినిస్ట్రేటర్లు, 53 మంది మోడరేటర్లు ఉన్నారు. వీరెవరికి బీజేపీతో సంబంధాలు లేవని, ఎవరి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం  తీసుకోకుండా ఈ గ్రూపును నడుపుతున్నట్లు వ్యవస్థాపకులు, నిర్వాహకులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే ఈ మోడరేటర్లలో ముగ్గురికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. వారిలో ఒకరు బీజేపీ పార్టీ సభ్యులుకాగా, మరో ఇద్దరు బీజేపీ సోషల్‌ మీడియాలో పనిచేస్తున్నవారు. వారిలో మోడరేటర్‌ ముకుల్‌ జైన్‌ తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో తాను బీజేపీ ఐటీ, సోషల్‌ మీడియాలో పనిచేస్తున్నట్లు చెప్పుకున్నారు. ‘వియ్‌ సపోర్ట్‌ నమో, భారతీయ జీవన్, దీశీ వికాస్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పుకున్నారు.

ఓమతాన్నిగానీ, ఓ వ్యక్తినిగానీ కించపరిచే విధంగా లేదా దూషించే విధంగా పోస్ట్‌లు పెట్టరాదని, లైక్స్‌ను, వాట్సప్‌ నెంబర్లను అడగరాదని, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను పెట్టరాదని, నకిలీ వార్తలు పోస్ట్‌ చేయరాదని, తమ కామెంట్ల ప్రమోషన్‌కు చీప్‌ పద్ధతులకు పోరాదని ‘హౌజ్‌ కీపింగ్‌ రూల్స్‌’లో వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ పేజీ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిని గ్రూప్‌ నుంచి తక్షణమే తొలగిస్తామని కూడా పేర్కొంది. ఇప్పుడు ఈ పేజీ నకిలీ వార్తల ఫ్యాక్టరీగా మారింది. బీజేపీ సోషల్‌ మీడియాలో పనిచేస్తూ ‘వియ్‌ సపోర్ట్‌ నమో’ ఫేస్‌బుక్‌ పేజీని నిర్వహిస్తున్న ముకుల్‌ జైన్‌ నుంచి నకిలీ వార్తలు ఎక్కువగా పోస్ట్‌ అవుతున్నాయి. అలాగే ముందుగా ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’ పేజీలో ప్రత్యక్షమవుతున్న నకలీ వార్తలు ఆ తర్వాత జైన్‌ నిర్వహిస్తున్న నమో పేజీలో కూడా కనిపిస్తున్నాయి. ఒక్క నకిలీ వార్తలే కాదు, నకిలీ కొటేషన్లు కూడా ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.

ఎన్‌డీటీవీ న్యూస్‌ యాంకర్‌ పేరిట
తాజాగా ఎన్డీటీవీ హిందీ న్యూస్‌ యాంకర్‌ రవిష్‌ కుమార్‌ పేరిట ఏప్రిల్‌ పదవ తేదీ, ఉదయం 9.11 గంటలకు ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’ పేజీలో దాని మోడరేటర్లలో ఒకరైన సమీర్‌ సచ్‌దేవ్‌ పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత సరిగ్గా నాలుగు నిమిషాలకు అంటే, ఉదయం 9.15 గంటలకు అదే పోస్టింగ్‌ను ‘వియ్‌ సపోర్ట్‌ నమో’ పేజీలో దాని మోడరేటర్‌ ముకుల్‌ జైన్‌ పోస్ట్‌ చేశారు. ‘ముస్లింల మెజారిటీ కలిగిన కశ్మీర్‌లో పండిట్లను ఊచకోత కోయడంతోపాటు వారిని అక్కడి నుంచి తరిమికొట్టిన పాపానికి భారత్‌ నుంచి రోహింగ్యా ముస్లింలను తరిమికొట్టాలా? హిందువులకు ఇంత అసహనం ఎందుకు?’  అది ఆయన పేరుతో వచ్చిన కొటేషన్‌. అది నకిలీ కొటేషన్‌ అని, అలాంటి వ్యాఖ్యలు తాను ఎక్కడా చేయలేదని రవిష్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు.


సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేరిట

అంతకుముందు జనవరి నెలలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పేరిట ముందుగా ‘వియ్‌ సపోర్ట్‌ నమో’ పేజీలో కనిపించిన నకిలీ కొటేషన్‌ ఆ తర్వాత కొద్ది సేపటికి ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’ గ్రూప్‌లో కనిపించింది. దాన్ని ఆయన వెంటనే ‘ట్విట్టర్‌’ ద్వారా ఖండించారు. ‘తన అభిప్రాయాలతో విభేదించేవారు ఇంత నీచానికి దిగుతారా’ అంటూ ఆయన ఖండించారు. తోటి నటి షబానా ఆజ్మీని తిడుతూ ‘కంగనా రనౌత్‌’ ఘాటైన వ్యాఖ్యలు చేశారంటూ నకిలీ వార్తను పెట్టారు.

ప్రియాంక గాంధీ మెడలో శిలువ
రాయబరేలిలో ఎప్పుడో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రియాంక గాంధీ ర్యాలీ ఫొటో తీసుకొని ఆమె మెడలో శిలువ ధరించినట్లుగా మార్ఫింగ్‌ ఫొటోను పెట్టారు. ‘మంగళసూత్రం ధరించాల్సిన దత్తాత్రేయ బ్రాహ్మణ మహిళ ఏం ధరించిందో చూడండి’ అంటూ కామెంట్‌ చేశారు. వాస్తవానికి ఆమె చిన్న లాకెట్‌ ధరించింది. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్‌ ఇస్లాం మతం పుచ్చుకున్నట్లు తప్పుడు వార్తను పోస్ట్‌ చేశారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో బీహార్‌ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

మోదీ, అమిత్‌ షా అధికారంలోకి వచ్చినట్లయితే పాకిస్థాన్‌ సర్వనాశనం అవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ వ్యాఖ్యానించినట్లు తప్పుడు వీడియోను పెట్టారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను గతంలో ఎప్పుడో సంజయ్‌ దత్‌ కలుసుకున్న ఫొటోను పెట్టి బీజేపీలో చేరిన సంజయ్‌ అని కామెంట్‌ పెట్టారు. గతంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ బర్ఖాదత్‌ సిగరెట్‌ తాగుతుంటే పక్కన ఓ ముస్లిం సామాజిక కార్యకర్త మందు తాగుతున్నట్లు మార్ఫింగ్‌ ఫొటో పెట్టి దుష్ప్రచారం చేశారు. ఒకటా, రెండా, ఇలా కోకొల్లలు. ‘సత్యమేవ జయతే!’ లోగోను పెట్టుకున్న ‘వియ్‌ సపోర్ట్‌ నరేంద్ర మోదీ’ గ్రూప్‌ ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడమా! ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ సమాచార, ఐటీ విభాగం ఇంచార్జి అమిత్‌ మాల్వియా దృష్టికి మీడియా తీసుకెళ్లగా, ఆయన ఇంకా స్పందించలేదు. నకిలీ వార్తల కారణంగానే ఆ గ్రూప్‌ నుంచి తప్పుకున్నానని బసంత్‌ సేథియా తెలిపారు.

ఫేస్‌బుక్‌ హామీని నిలబెట్టుకోవాలి!
సరిగ్గా ఎన్నికలకు పది రోజుల ముందు అంటే, ఏప్రిల్‌ ఒకటవ తేదీన ‘ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు’ తీసుకుంటానని దానీ సీఈవో జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కూడా చెబుతున్నారు. అయతే ఈ క్షణం వరకు కూడా నకిలీ వార్తలకు తెరపడలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement