సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రచార సభలతో కాంగ్రెస్ వారి మానసిక పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దామరచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖ రిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి జగదీశ్‌రెడ్డి టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘నల్లగొండలో టీఆర్‌ఎస్ బహిరంగసభ తర్వాత కాంగ్రెస్ నేతల మానసిక ప్రవర్తన మారినట్టుగా ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసిక స్థితి బాగా లేదని.. ఇప్పుడు ప్రజలు కూడా అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దామరచర్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి కేంద్రాన్ని మూసేస్తామని కోమటిరెడ్డి అనడాన్ని ఖండిస్తున్నాం. ఇది కోమటిరెడ్డి వైఖరా, కాంగ్రెస్ వైఖరా స్పష్టంచేయాలి. నల్లగొండకు దామరచర్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పోరాడి సాధించుకున్నాం. కోమటిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలిస్తే కదా మళ్ళీ రాజీ నామా చేయడానికి.. నల్లగొండ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ పార్టీ ఎంత అడ్డుకున్నా దామరచర్ల ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం’ అని జగదీశ్ వ్యాఖ్యానించారు.
ఆసరా పెన్షన్లు ఆపమనేటట్టున్నారు..
బతుకమ్మ చీరల పంపిణీ, రైతు బంధు చెక్కులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ తీరును ప్రజలు గమనించాలని జగదీశ్ చెప్పారు. ‘కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే ఆసరా పెన్షన్లను ఆపాలని కోరేటట్లున్నారు. కాంగ్రెస్ ప్రజాద్రోహి పార్టీ. ఎలాగూ ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నేతలు ప్రజలపై కక్ష కడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైంది.
కేసీఆర్ దీక్షపై ఇప్పు డు కాంగ్రెస్ నేతలు మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు. కేసీఆర్ పేరు వింటేనేబాబు భయపడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజ ల రక్షకుడిగా చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలియజెప్పాల్సిన అవసరముంది’ అని అన్నారు.
వాళ్లలో వాళ్లే పొడుచుకునేలా ఉన్నారు: గుత్తా
కాంగ్రెస్‌లో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారని ఎంపీ గుత్తా ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారసభలో జానారెడ్డి, విజయశాంతి లాంటి వాళ్ళు కత్తి తిప్పుతుంటే, వాళ్లలో వాళ్లే పొడుచుకుంటారేమోనని అనుమానం వచ్చిందన్నారు. ‘అన్నీ ఆలోచించాకే దామరచర్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై నిర్ణయించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి స్థిమితంలేదు. రూ.30 వేల కోట్లతో చేపట్టిన దామరచర్ల ప్రాజెక్టును ఆపడం కోమటిరెడ్డి వల్ల అవుతుందా? ఇలాంటి వ్యాఖ్యలతో ఏ పరిజ్ఞానం లేదని కోమటిరెడ్డి నిరూపించుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనులపై కోమటిరెడ్డి అబద్ధాలు మాట్లాడారు. ఈ పాజెక్టుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఎక్కువ నిధులు విడుదల చేసింది’ అని గుత్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment