ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ | Crossover rocked by the Assembly | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ

Published Tue, Nov 18 2014 1:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ - Sakshi

ఫిరాయింపులపై దద్దరిల్లిన అసెంబ్లీ

  • వాయిదా తీర్మానానికికాంగ్రెస్ సభ్యుల పట్టు
  •  ఫిరాయింపులను సీఎం ప్రోత్సహిస్తున్నారంటూ ఆందోళన
  •  నల్లబ్యాడ్జీలు ధరించి పోడియం వద్ద నినాదాలు
  •  పలుమార్లు వాయిదా పడిన అసెంబ్లీ
  •  కాంగ్రెస్ వైఖరిపై మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్‌రెడ్డి మండిపాటు
  •  వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్
  •  బడ్జెట్ పద్దులపై సాగని చర్చ
  • సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సోమవారం రాష్ర్టఅసెంబ్లీ దద్దరిల్లింది. కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో హోరెత్తింది. ప్రశ్నోత్తరాల సమయంలో మొదట రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీని మధ్యాహ్నం మరోసారి సమావేశపరిచి పద్దులపై చర్చకు ఆహ్వానించినా పరిస్థితి మారలేదు. చివరకు సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టాలని స్పీకర్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. సీట్లలోనుంచి లేచి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    ఫిరాయింపులను ప్రోత్సహించడం టీఆర్‌ఎస్‌కు తగదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన కాంగ్రెస్ సభ్యులు.. సీఎం కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని పోడియం వద్దకు వెళ్లి పట్టుబట్టారు. ఫిరాయింపులపై చర్చించాలని, పార్టీలు మారిన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

    వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత చూద్దామని స్పీకర్ పదేపదే విన్నవించినా సభ్యులు పట్టించుకోలేదు. రాజ్యాంగాన్ని రక్షించాలి, సీఎం డౌన్‌డౌన్, సీఎం రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలంటూ నినదించారు. దీనిపై మంత్రి కే టీఆర్ మండిపడ్డారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొంటూ ఇందిరాగాంధీ హయాం నుంచి పీవీ నరసింహారావు వరకు జరిగిన ఫిరాయింపులను ప్రస్తావించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందన్నట్లు కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు.

    అయితే కాంగ్రెస్ సభ్యులు ఎంతకూ నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ మధుసూదనాచారి మొదట సభను 10 నిముషాలు వాయిదా వేశారు. తిరిగి సభ 10.55 గంటలకు సమావేశమైంది. అయినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. తమకు న్యాయం చేయాలని నినదించారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాంలాల్‌ను అడ్డంపెట్టుకొని దొడ్డిదారిన నాదెండ్ల భాస్కరరావును సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల హోరులో హరీశ్ మాటలు ఎవరికీ అర్థంకాలేదు.

    గందరగోళం మధ్య సభను రెండోసారి అరగంటపాటు స్పీకర్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.20 గంటలకుసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిందని పేర్కొంటూ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. బడ్జెట్ పద్దులను ప్రతిపాదించాల్సిందిగా మంత్రులను కోరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పద్దులను ప్రతిపాదించారు.

    ఈ సందర్భంగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు సంబంధించిన పద్దులపై మాట్లాడాల్సిందిగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ను సభాపతి కోరారు. పోడియం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సభ్యులతో ఉన్న సంపత్‌కుమార్ అందుకు నిరాకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ పద్దులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... దీన్నుంచి తప్పించుకునేందుకే ప్రతిపక్ష పార్టీ ఆందోళనకు దిగిందని విమర్శించారు.

    బడ్జెట్‌ను రాష్ట్రమంతా అభినందిస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాలు.. అనవసర రాద్ధాంతం చేస్తూ సభా కాలాన్ని వృథా చేస్తున్నాయన్నారు. ఏ సభ్యుడికైనా రాజకీయంగా పార్టీ మారే హక్కు ఉంటుందన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేతలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారో అందరికీ తెలుసని అన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement