సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విషజ్వరాలు, డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. ‘ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని మంత్రి ఈటల చెబుతున్నారు. రాష్ట్రంలో అనారోగ్యం ఎక్కువగా ఉంది కాబట్టే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగింది. అంతే కానీ ఇందులో ప్రభుత్వ గొప్పతనం ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది’ అని భట్టి హెచ్చరించారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చినా.. ప్రభుత్వం తిరస్కరించడంపై మండిపడ్డారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అసెంబ్లీలో భట్టి పేర్కొన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : సీతక్క
యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములకు ఇంతవరకు పట్టాలు లేవని.. యురేనియం తవ్వకాలపై ఇన్ని రోజులు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. శాసనసభ, మండలి వేదికగా యురేనియం నిక్షేపాల తవ్వకాలను నిలిపివేస్తున్నట్టు వెంటనే ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం స్వయంగా సందర్శించాలి
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి దాదాపు వెయ్యి మంది రోగులు విషజ్వరాలతో వస్తున్నారని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంగారెడ్డి ఆస్పత్రిని సందర్శించాలన్నారు. తనకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎంఐఎం, అధికార పార్టీ సభ్యులకు మైక్ అడుగుతే వెంటనే ఇస్తున్నారని.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడిని అయినందుకు తనకు మైకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లావాసి అయిన సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి సంగారెడ్డి ఆస్పత్రిని సందర్శించాలని అసెంబ్లీలో జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment