
సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి
అనంతపురం రూరల్ : తాడిపత్రిలో జేసీ ముఠా అరాచకం.. అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయని తాడిపత్రి మునిసిపల్ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తూ జేసీ బ్రదర్స్ రూ.200 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
తాడిపత్రిలో జేసీ సోదరులు ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తారన్నారు. గతంలో జేసీ బ్రదర్స్ తమపై అనేక అక్రమ కేసులు బనాయించారని, అవన్నీ భరించి తెలుగుదేశం పార్టీ కోసం తాము పనిచేశామన్నారు. 2014లో తన రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్‌కు సహకరించాలని అధిష్టానం చెప్పడంతో సర్దుకుపోయి జేసీ ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు కృషి చేశామని చెప్పారు. అయితే జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీని నమ్ముకొన్న వారికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి అనుచరులకే పదవులు కట్టబెట్టారని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుపోతే ఆయనా పట్టించుకోలేదన్నారు. తమను టీడీపీ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తలను జగ్జీబ్రదర్స్ ఖండించారు.
సస్పెన్షన్ ప్రచారం హాస్యాస్పదం
తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీకి కొన్ని రోజుల కిందటే తాము రాజీనామా చేశామన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ నుంచి తమను సస్పెండ్ చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. జేసీ కుటంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో ఆ కుటుంబం మరింతగా రెచ్చిపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. పార్టీ పరువును బజారుకీడుస్తున్నా అధినేత చంద్రబాబు మౌనంగా ఎందుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు..
జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యం
జేసీ దివాకర్‌రెడ్డి గతంలో తాడిపత్రిలో నామినేషన్ వేయయడానికి కూడా భయపడి పారిపోతే అప్పుడు ఎవరు అండగా ఉన్నారో తాడిపత్రి ప్రజలకు తెలుసని జగ్గీ బ్రదర్స్ అన్నారు. ఆ రోజుల్లో వందకు రెండొందలకు అడుక్కున్న మీకు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తాడిపత్రిలో గ్రానైట్ యాజమానులు, లారీల ఓనర్లను భయపెడుతూ నెలనెలా మామూళ్లు వసూలు చేస్తుంది మీరు కాదా అని నిలదీశారు. జేసీపీఆర్ పేరుతో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిస్తుంది ఎవరో ప్రజలకు తెలుసని, లారీలను పట్టుకొని కేసులు నమోదు చేసిన అదికారులను చంపుతామని బెదిరించిందీ నిజం కాదా అని అన్నారు. తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని ఓడించే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. జేసీ బ్రదర్స్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి తాడిపత్రిలో మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వారి పతనమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే దానికి జేసీ కుటుంబ సభ్యులే బాధ్యులని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment