సాక్షి, హైదరాబాద్: బలహీన వర్గాలకు చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పలు సంఘాలు ఫైర్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యోగ సంఘాల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్‌గౌడ్‌ను కించపరిచేలా మాట్లాడినందుకు జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, గౌడ సంఘంతో పాటు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ స్కాలర్ కేశబోయిన రవికుమార్ నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కొందరు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నోరు అదుపులో పెట్టుకోవాలి: టీజీవో
ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరును అదుపులో పెట్టుకోవాలని, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) సూచించింది. ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చిన సందర్భంగా సీఎంకు గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా, ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్‌గా స్వీట్ తినిపిస్తే తప్పేముందని, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి నోటికొచ్చినట్లు, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని టీజీవో ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
జగ్గారెడ్డి బీసీ వ్యతిరేకి: జాజుల
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కించపరిచేలా మాట్లాడటాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు, సైద్ధాంతిక విభేదాలు సాధారణమని, ఈ క్రమంలో వ్యక్తిగత విమర్శలు, దూషణలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని శనివారం ఒక ప్రకటనలో హితవు పలికారు. జగ్గారెడ్డి బీసీ వ్యతిరేకి అని, 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే బీసీలంతా ఒక్కటై ఆయన్ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని హెచ్చరించారు.
శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శిస్తే ఊరుకోం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తోన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ నేత పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ హెచ్చరించారు. జగ్గారెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి నడిచిన శ్రీనివాస్ గౌడ్‌ను విమర్శించే అర్హత జగ్గారెడ్డికి లేదన్నారు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే జగ్గారెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment