
సాక్షి, కాకినాడ: ప్రజల్లో సానుభూతి కోసం జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారా? కాకినాడలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముందు స్వయంగా జరిగిన ఈ సంఘటన చూస్తుంటే అవునని ఎవరైనా అంటారు. మొన్న ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై ఆవేశంతో దాడికి దిగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ-జనసేన కార్యకర్తలు బాహబాహికి దిగారు. రెండు వర్గాల వారికీ దెబ్బలు తగిలాయి. ఇప్పటి వరకూ బానే ఉంది. అంతా సద్దుమణిగింది. అయితే అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. మా పార్టీ కార్యకర్తలను ప్రాణాలు పోయేలా కొట్టారంటూ పవన్ కళ్యాణ్‌కు కాకినాడ కార్యకర్తలు, నేతలు కంప్లయింట్ చేశారు. దీంతో పరామర్శ అంటూ ఓ ప్రోగ్రామ్ పెట్టుకుని జనసేన బాసు రెండు రోజుల తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్ణం వచ్చి.. అక్కడి నుంచి కాకినాడకు కారులో వచ్చి మరీ దెబ్బలు తగిలిన కార్యకర్తలను ఓదార్చారు. దాడి జరిగింది ఆదివారం.. అయితే.. గాయపడ్డ జనసేన కార్యకర్తకు మాత్రం పవన్ పరామర్శ సమయంలో కూడా కాలి నుంచి తీవ్రంగా రక్తం కారిపోతోంది. ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత కూడా ఆ కార్యకర్త కాలు నుంచి రక్తం కారడం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. రెండ్రోజులు పాటు బ్లీడింగ్ అయితే ఇంకేమైనా ఉందా అంటూ ముక్కున వేలెసుకుంటున్నారు.
జనసేన మరో డ్రామా
పవన్ టూర్‌కు ముందు జనసేన ఆడిన మరో డ్రామా బయటపడింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై దుష్ప్రచారం చేసేలా ఓ వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించి జనసేన బ్యాచ్ అడ్డంగా బుక్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ నేతలు తమపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు సిద్ధమయ్యారు జనసేన మహిళా కార్యకర్తలు. ఈ క్రమంలో ఓ మహిళ మరో మహిళను ‘ఊ.... స్టార్ట్ చెయ్యి... మొదలు పెట్టు’ అనగానే ఆమె ఒక్కసారిగా బోరుమంటూ ఏడవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే మిగిలిన మహిళలు అందుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కథనాన్ని చదివేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని విమర్శించాలన్న పదాలు ఆ వీడియోలో కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.