నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న చిత్తూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (ఫైల్)
ఐదు నెలలుగా జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల హడావుడిలో ఎడతెరిపి లేకుండా కష్టపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు ఇంటింటా ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఆయా పార్టీల మ్యానిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయినా వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గాలికి జనసేన గ్లాసు గిర్రున తిరిగి బోల్తా పడింది. కాంగ్రెస్ హస్తం చిత్తుచిత్తయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ ప్రయోజనం ఏ మాత్రం కనిపించని పరిస్థితి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన సత్తా నిరూపించుకోలేకపోయింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఇంకా ఆగ్రహం తగ్గలేదు. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 13 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయారు. కౌంటింగ్‌లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ద్వారా అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పడ్డాయి... ఎంత శాతం వచ్చింది... అనే అంశంపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనమిదీ.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31,83,187 మంది ఓటర్లు నమోదయ్యారు. అందులో పురుషులు 15,77,116 మంది, మహిళలు 16,05,734 మంది, ఇతరులు 337 మంది ఉన్నారు. వారిలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో 25,81,190 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 12,80,481 మంది, మహిళలు 13,00,659 మంది, ఇతరులు 50 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీల వారీగా అభ్యర్థులకు నమోదైన ఓట్లను పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీకి 53.25 శాతం (13,80,564), టీడీపీ 38.92 శాతం (10,08,874), జనసేనకు 3.21 శాతం (83,298), కాంగ్రెస్ 1.42 శాతం (36,695) ఓట్లు నమోదయ్యాయి. మూడు పార్లమెంట్ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 54.75 శాతం (21,11,880 ఓట్లు) , టీడీపీకి 38.32 శాతం (14,77,948 ఓట్లు) , జనసేనకు 0.88 శాతం (33,986 ఓట్లు), కాంగ్రెస్‌కు 1.81 శాతం (69,832 ఓట్లు) పడ్డాయి.
ఇదీ జనసేన
వైఎస్సార్‌సీపీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా జనసేన, కాంగెస్ పార్టీ అభ్యర్థులకు 14 నియోజకవర్గాలూ కలిపి ఓట్లు పడకపోవడం గమనార్హం. ఉదాహరణకు చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 1,27,790 ఓట్లు రాగా, జిల్లా వ్యాప్తంగా జనసేన, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు కలిపి 1,19,993 ఓట్లు లభించాయి. జనసేన పార్టీ అభ్యర్థులకు తంబళ్లపల్లెలో 5,018, పీలేరులో 2,374, చంద్రగిరి 4,531, శ్రీకాళహస్తి 5,274, సత్యవేడు 2,076, నగరి 3,044, జీడీ నెల్లూరు 3,364, చిత్తూరు 4,204, పూతలపట్టు 3,912, పలమనేరు 4,254, కుప్పంలో 1,879 ఓట్లు నమోదు అయ్యాయి. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో కలిపి 15 వేలలోపు ఓట్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీకి 3.21 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి.
కాంగ్రెస్ దుస్థితి ఇదీ
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 36,695 ఓట్లు లభించగా, 1.42 శాతం ఓటింగ్ నమోదైంది. తంబళ్లపల్లెలో 3,261 (1.84 శాతం), పీలేరులో 4,182 (2.34), మదనపల్లె 2,697 (1.50), పుంగనూరు 2,007 (1.02), చంద్రగిరి 1,551 (0.68), తిరుపతి 2,725 (1.51), శ్రీకాళహస్తి 2,170 (1.11), సత్యవేడు 3,908 (2.22), నగరి 3,357 (1.99), జీడీ నెల్లూరు 2.279 (1.32), చిత్తూరు 1,651(1.09), పూతలపట్టు 1,254 (0.67), పలమనేరు 1,814 (0.83), కుప్పం 3,839 (2.12 శాతం) ఓట్లు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థులు ఒకరు కూడా పది వేల ఓట్లు సంపాదించని దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment