సాక్షి, చెన్నై : పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండువారాలు ప్రచారం నిర్వహిస్తే.. సరిగ్గా 24 గంటలకు ముందు జయలలిత వీడియో విడుదల చేసి దినకరన్ వర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటిదాకా వార్తల్లో నిలిచిన అంశాలను ముఖ్యంగా డబ్బు పంపిణీ వంటి వాటిని ఈ వార్త ఒక్కసారిగా తెరవెనక్కు నెట్టేసింది.
అనర్హత వేటు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే వెట్రివెల్ వీడియోను విడుదల చేస్తూ ఉప ఎన్నికకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అమ్మ మరణం వెనుక శశికళ పాత్ర లేదని నిరూపించేందుకు.. చికిత్స మెరుగ్గా అందించామని చెప్పేందుకే విడుదల చేశామని చెప్పటంతోనే అసలు చర్చ మొదలైంది. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం తనకేం పట్టన్నట్లు ఉండటం.. పైగా నేతలను మౌనంగా ఉండాలంటూ ఆదేశించటం... ఈ ఎపిసోడ్ వెనుక వేరే ఏదో మతలబు ఉందన్న సంకేతాలను ముందుగా అందించింది. ప్రతిపక్షాలు కూడా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో పెద్దగా స్పందించలేదు.
కానీ, ఏడాది తర్వాత ఈ సమయంలోనే ఎందుకు రిలీజ్ చేశారన్న ప్రశ్న.. వీడియో అసలుదేన్నా అన్న అనుమానంతో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీని వల్ల దినకరన్ వర్గానికి ఒరిగేదేం లేదని వారంటున్నారు. వీడియో చూసి ఎమోషనల్‌గా అమ్మ సెంటిమెంట్‌కు జనాలు కనెక్ట్ అయ్యి ఓట్లు వేయటం కూడా అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘ టిపికల్ పొలిటికల్ స్టంట్’ గా దీనిని అభివర్ణిస్తున్న విశ్లేషకులు.. దాని ప్రభావం తెలియాలంటే మరో మూడు రోజులు(ఫలితాలు వచ్చేదాకా) ఓపిక పట్టాల్సిందేనంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment