సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జేసీ, ప్రభోదానంద స్వామి ఫొటోలు
సాక్షి, అనంతపురం/అమరావతి : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామం కేంద్రంగా ఉన్న ప్రభోదానందస్వామి ఎవరో తనకు తెలియదని జేసీ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రభోదానందస్వామి వర్గీయులతో జేసీ వర్గీయులు ఘర్షణకు దిగుతుండటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభోదానంద ఎవరో తెలియదంటూ జేసీ చెబుతుండగా.. 12 ఏళ్ల కిందట ఆయనే స్వయంగా ప్రభోదానంద స్వామి ఆశ్రమాన్ని ప్రారంభించిన ఫొటోలు తాజాగా వెలుగుచూశాయి. ఆశ్రమం ప్రారంభం సందర్భంగా ప్రభోదానంద గొప్పవారంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రభోదానందస్వామి కొడుకు యోగానంద చౌదరి ఇటీవల బీజేపీలో చేరడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ఆధిపత్యం కోసమే ప్రభోదానందతో జేసీ బ్రదర్స్ ఘర్షణకు దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు తొందరగా తేల్చే మనిషా?
మరోవైపు జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ప్రభోధానందపై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చంద్రబాబుకు చెప్పాల్సిందంతా చెప్పేశానని, వీడియో క్లిప్పింగులు కూడా అందజేశానని ఆయన మీడియాకు తెలిపారు. అనంతపురంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్పాల్సింది తాను కాదు హోంమంత్రి చినరాజప్ప అని అన్నారు. ప్రభోదానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయమై మీడియా ప్రశ్నలకు బదులిస్తూ చంద్రబాబు ఏదైనా తొందరంగా తేల్చి చెప్పే మనిషా? అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment