బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ | JC Diwakar Reddy Controversial Comments On Police Department | Sakshi
Sakshi News home page

బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా : జేసీ

Published Wed, Dec 18 2019 5:39 PM | Last Updated on Thu, Dec 19 2019 3:33 AM

JC Diwakar Reddy Controversial Comments On Police Department - Sakshi

అనంతపురం టౌన్‌/తాడిపత్రి: టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోమారు రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సమక్షంలోనే పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురంలో జరిగిన జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జేసీ.. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని, వారికి వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి తమపై ఏకపక్షంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో విశ్రాంత ఇంజనీర్‌పై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులపైనా ఇవే కేసులు పెడతామన్నారు.

ఇప్పుడున్న పోలీసు అధికారులు ఎమ్మెల్యేకు మాత్రమే సెల్యూట్‌ కొడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే అధికారులను తెచ్చుకుంటామంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘రేయ్‌.. నువ్వు ఉద్యోగంలో ఉండేది ఐదేళ్లు కాదు. ముప్పై ఏళ్లు. మేం అధికారంలోకి వచ్చాక  ఈ పోలీసులు ఎక్కడున్నా వదిలిపెట్టబోం’ అని బెదిరింపులకు దిగారు. ‘మాకూ గంజాయి ఉంది.. మాకు సారా ఉంది జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. చంద్రబాబు శాంతి.. శాంతి అంటూ తమను చంక నాకించారని వాపోయారు. ఇప్పుడు పాలన గాడి తప్పిందని.. తెదేపా అధికారంలోకి వస్తే ఇంత కంటే దారుణంగా ఉంటుందన్నారు. కాగా, మంగళవారం తాడిపత్రిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జేసీ చేసిన ఇవే వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement