సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరులో కీలకమైన క్యాబ్ డ్రైవర్ల ఓట్లను లక్ష్యంగా చేసుకుని పార్టీ తరఫున ‘క్యాబ్’ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఏమిటీ కొత్త యాప్..
బెంగళూరులో ఓలా, ఉబర్ సంస్థలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు గత మార్చిలో ఆయా సంస్థల తీరును నిరసిస్తూ ధర్నాలకు దిగారు. క్యాబ్‌ల సంస్థలు తమ నుండి ఎక్కువ కమీషన్‌ను తీసుకుంటూ తమ శ్రమను దోపిడీ చేస్తున్నాయన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో ధర్నాలో ఉన్న క్యాబ్ డ్రైవర్లతో సమావేశమైన జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ రెండు సంస్థలకు ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున ఒక క్యాబ్ సంస్థను అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో ఈ క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని పొందేందుకు గాను ‘నమ్మ టీవైజీఆర్’ పేరిట క్యాబ్ సేవల యాప్‌ను ప్రవేశపెట్టనుంది.
12 శాతమే కమీషన్ తీసుకుంటారట
ప్రస్తుతం క్యాబ్ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 20–25 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నాయి. ‘నమ్మ టీవైజీఆర్’ 12.5 శాతమే కమీషన్‌ను తీసుకుంటామని చెబుతున్నారు. ఇందులో చేరే క్యాబ్ డ్రైవర్లకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా, వైద్య బీమా సౌకర్యం, డ్రైవర్ల పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, క్యాబ్‌లకు ఉచిత సర్వీసు వంటి ప్రయోజనాలను కల్పించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో వివిధ క్యాబ్ సంస్థలకు 1.14లక్షల మంది డ్రైవర్లుగా ఉన్నారు. వీరందరినీ ‘నమ్మ టీవైజీఆర్’ సంస్థలో చేర్చుకోవాలని జేడీఎస్ పావులు కదుపుతోంది.
10 వేల మంది నమోదు
నవంబర్ 1 నుండి ఇప్పటివరకు మా సంస్థలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసేందుకు 10 వేల మంది డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మా సంస్థ క్యాబ్‌లు ఎప్పుడూ ఒకే ధరలను వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి. క్యాబ్ డ్రైవర్లకు కూడా ప్రయోజనం కలిగించేలా తక్కువ కమీషన్లు తీసుకుంటాం.
– తన్వీర్ పాషా, నమ్మ టీవైజీఆర్ క్యాబ్ యూనియన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment