H D Kumaraswamy
-
సీఎం పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) వివాహం ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దగ్గరి బంధువు డాక్టర్ గుర్ప్రీత్ కౌర్(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివాహం జరగడం చర్చనీయాంశంగా మారగా.. గతంలోనూ ఇలా రాజకీయంగా అత్యున్నత హోదాలో ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. హెచ్డీ కుమారస్వామి జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు. 1986లోనే ఆయనకు వివాహం అయ్యింది. అయితే.. 2006లో ఆయన కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటించేదాకా ఈ విషయం బయటకు తెలీలేదు. ఆ తర్వాత కుమారస్వామి కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నేత ఈయన. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1983లో వీర్‌భద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆయన. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించింది. ప్రతిభా సింగ్ ఎవరో కాదు.. మండి లోక్ సభ ఎంపీ. బాబుల్ సుప్రియో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. 2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన.. 2019లో మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల మధ్య పరిచయం అయ్యింది. చందర్ మోహన్ హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్నప్పడు.. ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు ఆయన. భార్య సీమా భిష్ణోయ్ సమ్మతితోనే.. చాంద్ మొహమ్మద్, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ చర్య ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అయితే ఈ ప్రేమ కథ ఎన్నోరోజులు సాఫీగా సాగలేదు. కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ప్రఫుల్లా కుమార్ మహంతా అస్సాం మాజీ ముఖ్యమంత్రి. 1985 డిసెంబర్ నుంచి 1990 వరకు ఆయన సీఎంగా విధులు నిర్వహించారు. సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను ఆయన వివాహం చేసుకున్నారు. రైటర్ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. భార్య జయశ్రీ గోస్వామితో ప్రఫుల్లా కుమార్ మహంతా -
కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం...
బెంగళూరు : కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు. మండ్యా జిల్లాలో ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మండ్యా జిల్లాలోని కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి బీఎల్ దేవరాజ్ తరఫున కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారుడిని ఎన్నికల బరిలో నిలపాలని అనుకోలేదు. మండ్యా ప్రజలే అతన్ని ఎన్నికల్లో నిలపమని కోరారు.. కానీ వారే అతనికి మద్దతు ఇవ్వలేదు.. ఇది నన్ను చాలా బాధించింది. నా కొడుకు ఎందుకు ఓడిపోయాడో అర్థం కావడంలేద’ని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. అలాగే తనకు రాజకీయాలు అవసరం లేదని.. ప్రజల ప్రేమని మాత్రమే కోరుకుంటున్నట్టు తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఈ ఉప ఎన్నికల్లో కనీసం 8 స్థానాలు గెల్చుకోవాలి. డిసెంబర్ 9వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మండ్యా లోక్‌సభస్థానం నుంచి పోటీచేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్.. సినీ నటి సుమలత చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా పలుమార్లు కుమారస్వామి ప్రజలతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. -
84 ఏళ్లు జీవిస్తా : సీఎం
మండ్య : సమీప భవిష్యత్తులో తనకు మరణం సంభవించే అవకాశమే లేదని, 84 ఏళ్ల వరకు మృత్యువు తన దరికి చేరదంటూ సీఎం కుమారస్వామి తెలిపారు. శనివారం పాండవపుర పట్టణంలోని తాలూకా క్రీడామైదానంలో మండ్య ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారాల్లో కుమారస్వామి మాట్లాడారు. మళవళ్లిలో ప్రచారాలు నిర్వహించే సమయంలో భావోద్వేగానికి లోనయ్యామని, అందుకే ఎప్పుడు చనిపోతామో తెలియదంటూ వ్యాఖ్యానించామన్నారు. అయితే రేపే చనిపోతానంటూ తాను ఎక్కడా చెప్పలేదని ప్రసార మాధ్యమాల్లో ఆ విధంగా ప్రచారం జరగడంతో తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి తాండవిస్తోందని ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో కోట్ల కొద్ది నగదు, కేజీల కొద్ది బంగారు ఆభరణాలు దొరుకుతుండడం ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అద్దం పడుతోందన్నారు. రుణమాఫీపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని అప్పటి వరకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఓపిక పట్టాలంటూ సూచించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ బీజేపీ అర్థరహిత వ్యాఖ్యలు చేస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో మంత్రి సీఎస్ పుట్టరాజు, ఎమ్మెల్యే సురేశ్‌గౌడ, ఉపఎన్నికల అభ్యర్థి శివరామేగౌడ పాల్గొన్నారు. -
క్యాబ్ డ్రైవర్లకు జేడీఎస్ వల!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరులో కీలకమైన క్యాబ్ డ్రైవర్ల ఓట్లను లక్ష్యంగా చేసుకుని పార్టీ తరఫున ‘క్యాబ్’ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఏమిటీ కొత్త యాప్.. బెంగళూరులో ఓలా, ఉబర్ సంస్థలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు గత మార్చిలో ఆయా సంస్థల తీరును నిరసిస్తూ ధర్నాలకు దిగారు. క్యాబ్‌ల సంస్థలు తమ నుండి ఎక్కువ కమీషన్‌ను తీసుకుంటూ తమ శ్రమను దోపిడీ చేస్తున్నాయన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో ధర్నాలో ఉన్న క్యాబ్ డ్రైవర్లతో సమావేశమైన జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ రెండు సంస్థలకు ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున ఒక క్యాబ్ సంస్థను అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్లో ఈ క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని పొందేందుకు గాను ‘నమ్మ టీవైజీఆర్’ పేరిట క్యాబ్ సేవల యాప్‌ను ప్రవేశపెట్టనుంది. 12 శాతమే కమీషన్ తీసుకుంటారట ప్రస్తుతం క్యాబ్ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 20–25 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నాయి. ‘నమ్మ టీవైజీఆర్’ 12.5 శాతమే కమీషన్‌ను తీసుకుంటామని చెబుతున్నారు. ఇందులో చేరే క్యాబ్ డ్రైవర్లకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా, వైద్య బీమా సౌకర్యం, డ్రైవర్ల పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, క్యాబ్‌లకు ఉచిత సర్వీసు వంటి ప్రయోజనాలను కల్పించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు నగరంలో వివిధ క్యాబ్ సంస్థలకు 1.14లక్షల మంది డ్రైవర్లుగా ఉన్నారు. వీరందరినీ ‘నమ్మ టీవైజీఆర్’ సంస్థలో చేర్చుకోవాలని జేడీఎస్ పావులు కదుపుతోంది. 10 వేల మంది నమోదు నవంబర్ 1 నుండి ఇప్పటివరకు మా సంస్థలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసేందుకు 10 వేల మంది డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మా సంస్థ క్యాబ్‌లు ఎప్పుడూ ఒకే ధరలను వినియోగదారుల నుండి వసూలు చేస్తాయి. క్యాబ్ డ్రైవర్లకు కూడా ప్రయోజనం కలిగించేలా తక్కువ కమీషన్లు తీసుకుంటాం. – తన్వీర్ పాషా, నమ్మ టీవైజీఆర్ క్యాబ్ యూనియన్ అధ్యక్షుడు -
'మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తా..'
► నాపై ఐటీకి ఫిర్యాదు యడ్యూరప్ప పనే ►రూ.300-400 కోట్లిస్తే మా ఆస్తులు రాసిస్తా ►జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి బెంగళూరు: తన కుటుంబం వద్ద రూ. 20 వేల కోట్ల బినామీ ఆస్తులున్నట్లు కేంద్ర ఐటీకి ఫిర్యాదు వెళ్లడం వెనుక బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప హస్తం ఉన్నట్లు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. తనకెవరైనా రూ.300– 400 కోట్లు ఇస్తే తన కుటుంబం పేరుతో ఉన్న ఆస్తులన్నీ రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగా, తమ కుటుంబంపై రాజకీయ అక్కసుతో ఈ ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన విధానసౌధలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనపై ఫిర్యాదు చేసిన వెంకటేష్‌గౌడ కాంగ్రెస్ కార్యకర్త కాదని పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ప్రకటించారని, అతడు యడ్యూరప్ప మనిషని కుమార విమర్శించారు. ఆ ఫిర్యాదు ఎక్కడ టైప్ అయ్యిందనేది తనకు తెలుసన్నారు. ఈ కుతంత్రం వెనక యడ్యూరప్ప హస్తం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. యడ్యూరప్పతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నా...సదరు ఫిర్యాదు పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి, ఒకవేళ బినామి ఆస్తులు రూ.20వేల కోట్లు బయటపడితే వెంటనే సదరు సొమ్మును రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేయడానికి వినియోగించవచ్చు.’ అని కుమారస్వామి సవాలు విసిరారు. రానున్న ఎన్నికల్లో పార్టీకి రూ.300 నుంచి రూ.400 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఈ సొమ్మును ఇస్తే తమ కుటుంబం పేరుమీద ఉన్న ఆస్తులు రాసిస్తానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు కుమారస్వామి సమాధానమిచ్చారు. కుమార ఆస్తులు రూ.20 వేల కోట్లు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, ఆయన కుటుంబం బినామీ పేర్లతో రూ.20వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని వెంకటేష్ గౌడ అనే వ్యక్తి కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. రియల్ఎస్టేట్, చిత్రనిర్మాణం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తదితర రంగాల్లో కుమారస్వామి కుటుంబం బినామీ పేర్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోందని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. కుమారస్వామి, కుటుంబానికి రూ.20 వేల కోట్ల విలువ చేసే స్థిరాస్తులు బెంగళూరు, ఢిల్లీతో పాటు అమెరికా తదితర చోట్ల ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ భాగం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ కోడలు కవిత పేరు పైన ఉన్నాయన్నారు. సాధారణ గృహిణి అయిన కవిత కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారని అన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అందులో పేర్కొన్నారు. -
ఆ కార్లు, వాచీలు మీకు ఎవరిచ్చారు?
హెచ్.డి.కుమారస్వామికి ఎమ్మెల్సీ ఉగ్రప్ప ప్రశ్నాస్త్రాలు సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.50 నుంచి 70లక్షల విలువైన వాచ్ విషయాన్ని బహిర్గతం చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామిపై కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మాజీ సీఎం కుమారస్వామిపై ప్రశ్నాస్త్రాలను సంధించారు. శనివారమిక్కడ విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి, ఆయన కుటుంబం వినియోగిస్తున్న లగ్జరీ కార్లు, వాచ్‌ల వివరాలతో కూడిన జాబితాను ఉగ్రప్ప విడుదల చేశారు. అనంతరం ఉగ్రప్ప విలేకరులతో మాట్లాడుతూ....‘కుమారస్వామి ఆయన కుటుంబం కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వినియోగిస్తోంది. రూ.8కోట్ల విలువ చేసే లంబోర్గిని, రూ.3కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్, రూ.1.2కోట్ల విలువ చేసే ఇన్ఫినేటివ్ ఎఫ్ఎక్స్ కార్లను కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇక వీటితో పాటు మొత్తం ఎనిమిది కారులు కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇందులో రెండు కార్లు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు’ అని అన్నారు. ఇక కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.6కోట్ల విలువ చేసే కారు, రూ.1.3కోట్ల విలువ చేసే డైమండ్ వాచ్‌ను దుబాయ్‌లో ఒక వ్యక్తి నుండి బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు. ఈ బహుమతులు ఆయనకు ఎవరు ఇచ్చారో, ఏ పని చేసినందుకు ప్రతిఫలంగా అందుకున్నారో తెలపాలని కుమారస్వామిని డిమాండ్ చేశారు.ఇవే కాక రూ.50లక్షల విలువైన ఫ్రాంక్ ముల్లర్(డైమండ్) వాచ్, రూ.25లక్షలు విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాచ్, రూ.5లక్షల విలువైన రాడో వాచ్‌లతో పాటు మొత్తం 50 వాచ్‌లను కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కుమారస్వామి ప్రజలకు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హెచ్.ఎం.రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
'సచిన్ అంటే క్రికెట్...క్రికెట్ అంటేనే సచిన్'
భారతరత్నలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ సైంటిస్ట్ సీఎన్ఆర్ రావు లకు కర్నాటక అసెంబ్లీలో అభినందనలు తెలిపింది. కర్నాటకలో శీతాకాలపు సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యా మాట్లాడుతూ.. 24 ఏళ్ల పాటు క్రికెట్ రంగంలో కొనసాగి, అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని అన్నారు. 51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డే సెంచరీల సాధించారని.. 'సచిన్ అంటే క్రికెట్'.. 'క్రికెట్ అంటే సచిన్' అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ తప్పుకోవడం ఆ రంగానికి తీరని లోటు అన్నారు. నాకు క్రికెట్ ఆడటం రాదు. కాని టెండూల్కర్ ఆడిన ప్రతిసారి చూడటానికి ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు. క్రికెట్ దేవుడు అని కర్నాటక ప్రతిపక్ష నేత జేడీఎస్ నేత హెచ్ డీ కుమార స్వామి అన్నారు. సచిన్ రిటైర్మెంట్ తో దేశ ప్రజలు విచారంలో మునిగారు అని మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ అన్నారు. సచిన్ సాధించిన రికార్డులు క్రికెట్ కు పాపులారిటీని సంపాదించాయని కర్నాటక జనతా పక్ష అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప అన్నారు.