ఆ కార్లు, వాచీలు మీకు ఎవరిచ్చారు?
హెచ్.డి.కుమారస్వామికి ఎమ్మెల్సీ ఉగ్రప్ప ప్రశ్నాస్త్రాలు
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించిన రూ.50 నుంచి 70లక్షల విలువైన వాచ్ విషయాన్ని బహిర్గతం చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామిపై కాంగ్రెస్ నేతలు ప్రతి విమర్శలకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఉగ్రప్ప, మాజీ సీఎం కుమారస్వామిపై ప్రశ్నాస్త్రాలను సంధించారు. శనివారమిక్కడ విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి, ఆయన కుటుంబం వినియోగిస్తున్న లగ్జరీ కార్‌లు, వాచ్‌ల వివరాలతో కూడిన జాబితాను ఉగ్రప్ప విడుదల చేశారు. అనంతరం ఉగ్రప్ప విలేకరులతో మాట్లాడుతూ....‘కుమారస్వామి ఆయన కుటుంబం కోట్ల రూపాయల విలువ చేసే కార్లను వినియోగిస్తోంది.
రూ.8కోట్ల విలువ చేసే లంబోర్గిని, రూ.3కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్, రూ.1.2కోట్ల విలువ చేసే ఇన్ఫినేటివ్ ఎఫ్‌ఎక్స్ కార్లను కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇక వీటితో పాటు మొత్తం ఎనిమిది కారులు కుమారస్వామి, ఆయన కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారు. ఇందులో రెండు కార్లు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా కాలేదు’ అని అన్నారు. ఇక కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.6కోట్ల విలువ చేసే కారు, రూ.1.3కోట్ల విలువ చేసే డైమండ్ వాచ్‌ను దుబాయ్‌లో ఒక వ్యక్తి నుండి బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు.
ఈ బహుమతులు ఆయనకు ఎవరు ఇచ్చారో, ఏ పని చేసినందుకు ప్రతిఫలంగా అందుకున్నారో తెలపాలని కుమారస్వామిని డిమాండ్ చేశారు.ఇవే కాక రూ.50లక్షల విలువైన ఫ్రాంక్ ముల్లర్(డైమండ్) వాచ్, రూ.25లక్షలు విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాచ్, రూ.5లక్షల విలువైన రాడో వాచ్‌లతో పాటు మొత్తం 50 వాచ్‌లను కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో కుమారస్వామి ప్రజలకు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హెచ్.ఎం.రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు.