సురేష్ (బీజేపీ), రమేష్ (కాంగ్రెస్)
సాక్షి, బెంగళూరు: జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల మధ్య కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామి శుక్రవారం విధానసభలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. అంతకుముందుగానే అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, బీజేపీల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. కాంగ్రెస్–జేడీఎస్ తరఫున మాజీ మంత్రి రమేశ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ తరఫున మాజీ మంత్రి సురేశ్‌కుమార్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండు పార్టీల అభ్యర్థులు గురువారం విధానసభ ప్రధాన కార్యదర్శి మూర్తికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు జరిగే స్పీకర్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు చేతులు పైకెత్తి ఎన్నుకుంటారు.
కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన రమేశ్‌కుమార్ గతంలో కూడా స్పీకర్‌గా పని చేసిన అనుభవం ఉంది. స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థే విజయం సాధిస్తారంటూ కాంగ్రెస్–జేడీఎస్, బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు 117 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో రమేశ్‌కుమార్ విజయం తథ్యమంటూ కాంగ్రెస్–జేడీఎస్‌కూటమి భావిస్తుండగా.. కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య తలెత్తుతున్న అభిప్రాయ బేధాలను తమకు అనుకూలంగా మార్చుకుని తమ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ను గెలిపించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.
స్పీకర్ ఎన్నికకు సర్వం సిద్ధం..
శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విధానసభలో జరుగనున్న స్పీకర్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విధానసభ ప్రధాన కార్యదర్శి ఎస్.మూర్తి తెలిపారు. గురువారం విధానసౌధలో మూర్తి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ స్థానం కోసం కాంగ్రెస్ తరఫున రమేశ్‌కుమార్, బీజేపీ నుంచి సురేశ్‌కుమార్ నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. సభలో ఎమ్మెల్యేలు చేతులు పైకెత్తడం ద్వారా స్పీకర్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే అవసరం అనుకుంటే ఓటింగ్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. స్పీకర్ ఎన్నిక అనంతరం బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కోనున్నారన్నారు. స్పీకర్ ఎన్నిక, బలపరీక్షల నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలన్నారు.
రమేశ్ విజయం తథ్యం : శుక్రవారం మధ్యాహ్నం విధానసభలో జరిగే స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థి రమేశ్‌కుమార్ విజయం సాధించడం తథ్యమంటూ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో గురువారం అభ్యర్థి రమేశ్‌కుమార్‌తో పాటు విధానసభ ప్రధాన కార్యదర్శి ఎస్.మూర్తికి నామినేషన్ అందించిన అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు. మొత్తం 117 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో విజయం రమేష్‌నే వరిస్తుందన్నారు.రమేశ్‌కుమార్‌కు గతంలో స్పీకర్ పని చేసిన అనుభం ఉందని సభను సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే నమ్మకంతోనే ఈసారి కూడా ఎంపిక చేశామన్నారు.
విజయం మాదే : స్పీకర్ ఎన్నికలో విజయం తమదేనంటూ బీజేపీ అభ్యర్థి సురేశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన విధానసభ ప్రధాన కార్యదర్శి ఎస్.మూర్తికి నామినేషన్ అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం మేరకే స్పీకర్ స్థానానికి జరిగే ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. విధానసభలో జరిగే స్పీకర్ ఎన్నికలో విజయం సాధించడానికి అవసరమయ్యే ఎమ్మెల్యేల బలం తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment