
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న మిషన్ భగీరథ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని సీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.40 వేల కోట్లు మిషన్ భగీరథకు వెచ్చిస్తోందని, దీనివల్ల ఒక్కొక్కరిపై రూ.20 వేల భారం పడుతోందని అన్నారు. స్థానికంగా ఫిల్టర్లు, ఆక్వావాటర్, గృహాల్లో ఫిల్టర్లు, నీటి డబ్బాలను తాగునీటి కోసం ప్రజలు వాడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వమందించే నీటిని రాబోయే రోజుల్లో బట్టలుతకడానికి, బాత్‌రూమ్, ఇంటి అవసరాలకు వాడుకుంటా రని చెప్పారు. మిషన్ భగీరథ నీటిని తాగడానికి వాడుకునే పరిస్థితులే ఉండవన్నారు. ఈ పథకం నీరు తాగడానికి ఉపయోగ పడకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పులభారాన్ని పెంచే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటిని అందించకపోగా ఇప్పటికే ఉన్న నీటి సరఫరా వ్యవస్థ, గ్రామాల్లోని రోడ్లను ధ్వంసం చేశారని విమర్శించారు.
ప్రాజెక్టుల తో కుంటలు, చెరువులు నింపాలని, దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ ప్రచార ఆర్భాటం చేసి భగీరథ ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులను ఆంధ్రా కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వంపై, ఈ పథకంపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment