రాంచి : ఇప్పటికే నాయకత్వ లేమి, ఆర్టికల్ 370 రద్దు విషయంలో నాయకుల వ్యాఖ్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తోటి నాయకుల అవినీతిని భరించలేకపోతున్నానంటూ జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారంటూ మండిపడ్డారు. నేరస్తుల కంటే నీచంగా ప్రవర్తిస్తున్న పార్టీ సభ్యులతో వేగలేనని.. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా రాహుల్ గాంధీ సహా పలువరు సీనియర్ నాయకులకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘ నేను అవినీతిని అస్సలు సహించను. కాబట్టి నా రాజీనామాను ఆమోదించండి. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. గతంలో అధికార పార్టీగా, ప్రతిపక్షంగా ప్రజల మన్ననలు అందుకున్నాం. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారం కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు టికెట్లను అమ్ముకుంటున్నారు. ఎన్నికల పేరు చెప్పి బాగా సొమ్ము చేసుకుంటున్నారు. యువకుడిగా ఉన్న సమయంలోనే ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న పోలీసు అధికారిగా నేను వీటిని సహించలేను.
నా ఉద్యోగ జీవితంలో చూసిన ఎంతో మంది దిగజారిన, కరడుగట్టిన నేరస్తుల కంటే వీరు హీనంగా ఉన్నారు. వారి విధానాలు మార్చుకోమని ఎంతగానో చెప్పిచూసినా లాభం లేకపోయింది.ఇక బాధ్యతల నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. అందుకే రాజీనామా చేస్తున్నా అని అజయ్ కుమార్ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో, సమర్థులకు టికెట్లు ఇవ్వడంలో నిజాయితీగా వ్యవహరించాలనుకుంటే వారంతా మోకాలు అడ్డారు’ అని ఆరోపించారు. అయితే పార్టీలో కొంతమంది నిజాయితీగానే ఉన్నారని, వారి పట్ల తనకు గౌరవభావం ఉంటుందన్నారు. కాగా అజయ్ కుమార్ గతంలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభ ఎంపీగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment