సాక్షి,అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు దాఖలు చేయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డితో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయించారని చెప్పారు. ఆయన వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి పేరులో కూడా రెడ్డి అని ఉందని, మరి ఆయన కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన వారేనా? అని ప్రశ్నించారు. బిర్రు ప్రతాప్‌రెడ్డి వివిధ సందర్భాల్లో చంద్రబాబు, లోకేశ్‌తో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు ప్రదర్శించారు. జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే..
- చంద్రబాబు హయాంలో ప్రతాప్‌రెడ్డికి ఉపాధి హామీ పథకంలో నామినేటెడ్ పదవి కట్టబెట్టారు.
- టీడీపీలోని బీసీ నేతలు బాబు తొత్తులుగా మారారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు.
- బీసీలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినవ పూలేగా ప్రశంసలు అందుకుంటున్నారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దే.
- రాష్ట్రంలో 220 మార్కెట్ యార్డు చైర్మన్ పదవులకుగానూ 110 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించారు.
- 1,620 పైచిలుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డైరెక్టర్ పదవులు ఇచ్చారు.
- బీసీల మనోభావాలను గుర్తించిన ముఖ్యమంత్రికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
గడువులేనందునే ‘సుప్రీం’కు వెళ్లలేకపోతున్నాం
స్థానిక సంస్థల ఎన్నికలను 59.85 శాతం రిజర్వేషన్లతో నిర్వహించాలని భావించాం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 50 శాతం కోటాతోనే నిర్వహిస్తాం. గడువు లేనందునే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లలేకపోతున్నాం. చట్టసభల్లో బీసీలకు ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.
– డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్
చంద్రబాబు బీసీల వ్యతిరేకి
టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని మరోమారు రుజువైంది. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత లభిస్తుందోననే భయంతో చంద్రబాబు కుట్రలకు తెరతీశారు.
– మంత్రి మోపిదేవి
Comments
Please login to add a commentAdd a comment