సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని, లోతైన అధ్యయనం లేకుండా ఆరోపణలు చేయరాదని ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. బుధవారం ఆయన ఏపీ బీజేపీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ అమలు చేస్తున్న ‘ఫీడ్ ద నీడ్’ అనే కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా అందరికీ అవసరమైన సాయం చేయాలన్నారు. బీజేపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారు.
ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు చేసిన విమర్శలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై పార్టీ నేతలు ఏ ఆరోపణలు అయినా చేసే ముందు అందుకు సంబంధించి వివరాలు, ఆధారాలు కేంద్ర పార్టీకి అందజేయాలని.. జాతీయ నాయకత్వం ఆమోదిస్తేనే ఆరోపణలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఏపీలో బీజేపీ స్వతంత్ర ప్రతిపక్షంగా వ్యవహరించాలని, టీడీపీ, వైఎస్సార్‌సీపీతో సమదూరం పాటించాలని ఆదేశించినట్టు సమాచారం.
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే విమర్శలా!
బీజేపీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం
అమరావతి: కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు సలహాలు ఇవ్వడం మాని విమర్శలు గుప్పించడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ శాసన సభ్యులను బాబు 12 గంటల పాటు నిరాహార దీక్షలు చేయమని చెప్పారే తప్ప.. పేద ప్రజలను ఆదుకోమని చెప్పక పోవడం దురదృష్టకరం. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్, ఆర్థిక పరిస్థితులపై సూచనలు, సలహాలు ఇవ్వకుండా దిక్కుమాలిన విమర్శలకు దిగటం ఆయన రాజకీయ జీవితంపై అసహ్యం వచ్చే విధంగా ఉంది. రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి కరోనాపై పోరాడాల్సిన సమయమమిది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment