బంగారు కాదు.. బాధల తెలంగాణ  | K Laxman Fires On KCR Govt | Sakshi
Sakshi News home page

బంగారు కాదు.. బాధల తెలంగాణ 

Published Mon, Jun 17 2019 2:37 AM | Last Updated on Mon, Jun 17 2019 2:37 AM

K Laxman Fires On KCR Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కోరుకునే బంగారు తెలంగాణ అంటే వివిధ రంగాల అభివృద్ధి, ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి పెద్ద పీట వేయడానికి దేశంలోని 70 శాతం మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయంపై చర్చించేందుకు నీతి ఆయోగ్‌ సమావేశం పెడితే కేసీఆర్‌ దానికి గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. ఆయన పాలనలో బంగారు తెలంగాణ ఏమో కాని బాధల తెలంగాణగా మారిపోయిందని దుయ్యబటారు. నిధులు, సంక్షేమం గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్‌కు ప్రధాని మోదీ గుర్తుకొస్తారని, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరానికి అన్ని అనుమతులు మోదీ ఇచ్చారని, అనేక రకాలుగా తెలంగాణను ఆదుకుంటున్నా నీతి ఆయోగ్‌ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం కోసం మహారాష్ట్రకు వెళ్లారని, ఢిల్లీకి వెళ్లినా మోదీని ఆహ్వానించలేదన్నారు. మోదీ దగ్గర కేసీఆర్‌కు ముఖం చెల్లకే ఆయన దగ్గరకు వెళ్లలేదని చెప్పారు. కేసీఆర్‌ కుమార్తె కవిత, వినోద్‌ల ఓటమి, బీజేపీ నాలుగు స్థానాలు గెలవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కారు, సారు, పదహారు రాలేదని కేసీఆర్‌ బేజారు అయ్యారన్నారు. ఫ్రంట్‌ టెంట్‌ ఎక్కడ పోయిందో అక్కడికి రాలేదన్నారు. ఏపీ సీఎం జగన్‌ కూడా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా అడిగారని, సంప్రదాయాన్ని కాపాడటానికి సమావేశానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించిందని, కాని రాష్ట్రంలో కేసీఆర్‌ వారి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ఉద్యోగులను పక్కన పడేశారన్నారు. వాటిపై ఈనెల, వచ్చే నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నామన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లలో ఫీజులు పెరిగాయని, వాటిని కట్టడి చేయడం లేదన్నారు. నిరుద్యోగ సమస్య అలాగే ఉందన్నారు. స్కాలర్‌షిప్స్‌ లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఏటా పదవీ విరమణలు పెరుగుతున్నాయని, ఖాళీలు పెరుగుతున్నాయని, అయినా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయడం లేదన్నారు. 

17న రౌండ్‌టేబుల్‌ సమావేశం.. 
ఫీజుల నియంత్రణపై ఈనెల 17న పిల్లల తల్లిదండ్రులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని లక్ష్మణ్‌ అన్నారు. 24వ తేదీన పాఠశాల విద్యాకమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని, ఆ తరువాత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. జూలై 6 నుంచి కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. డిసెంబర్‌ నాటికి సంస్థాగతంగా కమిటీల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. తమ జాతీయ పార్టీ పశ్చిమ బెంగాల్, తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదు చేపడతామన్నారు. చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరు ఏ పదవిలో ఉన్నారో చూసి జాతీయ పార్టీ ఆలోచించి తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో సచివాలయ భవనానికి వాస్తు దోషం ఉంటే సరిదిద్దుకోవాలే కానీ దాన్ని కూల్చి కొత్తది కట్టడం ఎందుకని ప్రశ్నించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement