‘మీ లాగులు తడవడం ఖాయం ’ | Kadiyam Srihari Fires On Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

ఇద్దరిని సమన్వయం చేయనోడు అధికారంలోకి తెస్తాడా?

Published Sat, Sep 1 2018 8:56 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Kadiyam Srihari Fires On Uttam Kumar Reddy - Sakshi

హన్మకొండ : సొంత జిల్లాలో ఇద్దరు నేతలను సమన్వయం చేయలేని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు తాము కూడా అతి పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నారని.. టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ చూశాక వారి లాగులు, పంచెలు తడవడం ఖాయమని చెప్పారు. సొంత జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డిలను సమన్వయం చేయనోడు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాడా అని ప్రశ్నించారు.

ఆ పార్టీలో జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో ఇద్దరేసి పోటీ పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ దొంగల్లా దోచుకున్నారని మండిపడ్డారు. దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్‌ నైజమని విరుచుకుపడ్డారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రూ.వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని చెబుతున్న ఆయన.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసలు ముందస్తు అంటేనే కాంగ్రెస్‌ గడగడలాడిపోతోందని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని టీఆర్‌ఎస్‌ చెప్పలేదని, అయితే.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పామని కడియం స్పష్టం చేశారు. 

ఉనికి కోసమే విపక్షాల విమర్శలు  
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు ఉనికి కోసం విమర్శలు చేస్తున్నాయని కడియం మండిపడ్డారు. అధికార పక్షంపై చౌకబారు విమర్శలు చేయకుండా, ముందుగా కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమి చేశారో, చేయనున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడానికే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. 25 లక్షల మందికి పైగా పాల్గొనే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement