సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారని, తాను మాత్రం హేతువాదినని చెప్పుకుంటూ వచ్చిన తమిళ్ మెగాస్టార్ కమల్ హాసన్ మాట మార్చేశారు. అవసరమైతే తాను బీజేపీతో దోస్తి కట్టడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రాజకీయాల్లో ఎలాంటి అంటరానితనం ఉండదని, ఒకవేళ అవసరమైతే, ప్రజల ప్రయోజనాల మేరకు తాను భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో కలిసి పనిచేయడానికైనా వెనుకాడబోనని పేర్కొన్నారు.
త్వరలోనే తాను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించిన కమల్ హాసన్, తన రాజకీయ రంగప్రవేశాన్ని నిర్థారించారు. ప్రస్తుతం ఆయన పెట్టబోయే పార్టీ గుర్తు, పేరు వంటి వాటిని ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. తన పార్టీతో తమిళనాడుకు మంచి రోజులు వస్తాయని, పళని పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని కమల్ హాసన్ అంతకముందు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తన పార్టీ డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే ఉంటుందని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు.