రజనీకి అమిత్‌షా ఫోన్
చెన్నై, సాక్షి ప్రతినిధి:సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కమలనాథులు మరోసారి కన్నువేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా రజనీని రాజకీయాల్లోకి దింపేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేరుగా రంగంలోకి దిగారు. రజనీని ఫోన్‌లో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆఫర్ కూడా ఇచ్చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో రజనీకాంత్ పేరు రాజకీయ తెరపైకి రావాల్సిందే. ‘కర్ర విరక్కూడదు, పాము చావాలి’ అనే సామెతలా యథాప్రకారం రజనీ సమాధానం చెప్పాల్సిందే. తన అభిమాన సంఘాల ద్వారా బీజేపీకి మద్దతిస్తున్నట్లు వాజ్‌పేయి హయాంలో రజనీ ప్రకటించారు. అప్పట్లో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో సైతం రజనీకోసం కమలనాథులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పట్లో ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లారు.
అయితే ఇది స్నేహపూర్వక కలయికేనని మీడియా వద్ద రజనీ ప్రకటించి జాగ్రత్తపడ్డారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలై అధికార పార్టీ అప్రతిష్టపాలు కావడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. బెయిల్‌పై జయ బయటకు వచ్చినా పోటీకి అనర్హురాలు కావడంతో ప్రతిపక్షాలకు అయాచిత వరమైంది. అన్నాడీఎంకే రాజకీయాలతో ఏర్పడిన అగాథాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ముందుకు ఉరుకుతున్నాయి. అత్యంత ప్రజాకర్షణ కలిగిన అమ్మ లేని తరుణంలో అదేస్థాయి ఆకర్షణ కలిగిన రజనీకాంత్‌ను ముగ్గులోకి దింపాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర రాజన్ ఇటీవల రజనీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. రజనీకాంత్ బీజేపీ రాజకీయాల్లోకి రావలసిన తరుణం ఇదేనంటూ ఈనెల 8వ తేదీన చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు.
అమిత్ షా ఆహ్వానం
ఇవన్నీ ఒక ఎత్తై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ రజనీకాంత్‌కు ఆహ్వానం పలికారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉంటూనే లింగా షూటింగ్ నిమిత్తం కర్ణాటకలో ఉన్న రజనీకాంత్‌ను సెల్‌ఫోన్ ద్వారా ఇటీవల సంప్రదించారు. ఏకంగా మూడు సార్లు రజనీకి ఫోన్ చేసి బీజేపీలో చేరేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకుంటే రాబోయే ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఆఫర్‌ను సైతం అమిత్‌షా ఇచ్చేశారు. ఇదే అదనుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (బీజేపీ) యడ్యూరప్ప, మరో అగ్రనేత ఈశ్వరప్ప నేరుగా రజనీని కలిశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే రజనీని కలిసే ప్రయత్నాలన్నీ జరిగినట్లు సమాచారం. బెంగళూరు రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షులు ఇళవరసన్ సైతం రజనీని కలిసి రాజకీయ ప్రవేశానికి ఇదే తరుణమని చెప్పారు.
ఁ్ఙలింగా చిత్రం షూటింగ్ పూర్తికాగానే మీకు స్పష్టమైన సమాధానం చెబుతాను, కొంచెం వెయిట్ చేయండిరూ.రూ. అంటూ రజనీ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రజనీ ఇచ్చిన ఈ సమాధానం సూచనప్రాయంగా అంగీకరించినట్లుగా భావిస్తూ అభిమానులు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తికాగానే అమిత్‌షా పూర్తిస్థాయిలో తమిళనాడుపై దృష్టి సారించనున్నట్ల్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రవేశించదలుచుకుంటే కొత్త పార్టీ పెట్టడం మేలా, బీజేపీలో చేరడం మంచిదా అనే అంశంపై రజనీ అభిప్రాయ సేకరణను ఆశిస్తున్నట్లు తెలిసింది. లింగా షూటింగ్ ముగిసేలోగా ఈరెండు అంశాలపై అభిమాన సంఘాల నుంచి అభిప్రాయసేకరణ చేయాల్సిందిగా స్వయానా సోదరుడైన సత్యనారాయణరావును రజనీ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.