రజనీ గడువుకు బీజేపీ నో
చెన్నై, సాక్షి ప్రతినిధి : సూపర్‌స్టార్ రజనీకాంత్ కు ఎలాగైనా పార్టీ తీర్థం ఇప్పించాలనే ప్రయత్నాలకు కమలనాథులు స్వస్తి పలికారు. మీనమేషాలు లెక్కించేవారితో పార్టీకి ప్రయోజనం ఉండదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.అన్నాడీఎంకేలో జయలలిత, డీఎంకేలో కరుణానిధి ప్రజాకర్షణ కలిగిన నేతలుగా ఉన్నారు.
రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి రావాలంటే అటువంటి నేత అవసరమని భావించిన కమలనాధుల కళ్లలో రజనీకాంత్ పడ్డారు. ఎన్నో ఏళ్లుగా ప్రధాని మోదీకి స్నేహితుడు, ఎంజీఆర్ తరువాత అంతటి అభిమాన సందోహం కలిగి ఉండడంతో రజనీకాంత్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మోదీ చెన్నైకి వచ్చినపుడు రజనీ ఇంటికి వెళ్లి కలిశారు.
తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న జయలలిత ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో జైలు పాలుకావడంతో అన్నాడీఎంకే ఆందోళనలో పడిపోయింది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇదే అదనుగా బలపడాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తుండగా, బీజేపీ నేతలు మరోసారి రజనీ నామస్మరణం చేశారు. బెంగళూరులో లింగా షూటింగ్‌లో ఉన్న రజనీకాంత్‌ను అక్కడి పార్టీ అగ్రనేతలు యడ్యూరప్ప కలిశారు. అమిత్‌షా స్వయంగా రజనీతో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సైతం రజనీని ఆయన ఇంటి వద్ద కలిశారు. పార్టీలోకి వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి మీరే అం టూ మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. లింగా విడుదల కానీయండి చూద్దాం అని రజనీ పరోక్షంగా బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అభిమాన సంఘాల అభిప్రాయాలు సేకరించాలని తన సోదరుడిని పురమాయించా రు. ఇక రజనీ బీజేపీలో చేరడం ఖాయమైనట్లేనని అందరూ సంబరపడిపోయారు. అయితే జయ బెయిల్‌పై బయటకు రాగానే రజనీకాంత్ అమెకు శుభాకాంక్షలు చెప్పడం తో కమలనాధులు ఖంగుతిన్నారు. ఇకపై రజనీ విషయం మరిచిపోవాలని నిర్ణయిం చుకున్నారు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షా రజనీ అంశాన్ని సైతం చర్చించారు. చెన్నైకి రాకముందే రజనీ పార్టీ ప్రవేశంపై నిర్ణయాన్ని చెప్పాలని కోరారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి అని రజనీ సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అంటే ఈ నాలుగు నెలల్లో జయలలిత కేసుల వ్యవహా రం ఒక కొలిక్కి వస్తుంది కాబట్టి రాష్ట్రంలో అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణ యం తీసుకుంటానని రజనీ గడువులోని ఆంతర్యాన్ని గ్రహించారు. రజనీ సమాధా నం నచ్చని అమిత్ షా నాలుగునెలల గడువును తిరస్కరించినట్లు పార్టీ నేత చెప్పారు. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవ్వ రూ పార్టీలోకి రావాల్సిన అవసరం లేదని అమిత్‌షా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షులే రజనీ కోరికను పక్కన పెట్టడంతో బీజేపీలోకి సూపర్‌స్టార్ ఎంట్రీ లేనట్లేనని తెలుస్తోంది.