మరో ప్రయత్నం
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మళ్లీ మళ్లీ గాలమేసేందుకు కమలనాథులు సిద్ధం అవుతున్నారు. తొలిసారిగా రాష్ట్రంలో అడుగు బెడుతున్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్వారా రజనీకి పిలుపు పంపేందుకు వ్యూహ రచన చేశారు. కూటమిలోని మిత్రులు దూరమవుతుండడంతో రాష్ట్రంలో మళ్లీ ఆవిర్భవించిన తమాకాని తమ వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నాల్లో పడ్డారు. రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు బీజేపీ ప్రతినిధిగా పొన్ రాధాకృష్ణన్ వెళ్లారు. ఆయనకు కేంద్రంలో సహాయ మంత్రి పదవి వరించింది. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో కమలనాథులకు ప్రతినిధులు లేరు.
2016 ఎన్నికల్లో ప్రతినిధులు అడుగు పెట్టడమే కాకుండా అధికారాన్ని శాసించడం లేదా అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కమలనాథులు పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రగతి చాటుతామన్న పిలుపునిచ్చే పనిలో పడ్డారు. రాష్ట్రంలో బలమైన వ్యక్తులుగా, జనాదరణ కల్గిన వారిని తమ వైపు తిప్పుకుని వారిని పార్టీలోకి ఆహ్వానించడం లేదా, మద్దతు కూడగట్టుకోవడం లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన దృష్టిని అంతా తమిళనాడు మీద కేంద్రీ కరించేందుకు సిద్ధం కావడంతో కమలనాథుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.
తలై‘వా’: ఇప్పటి వరకు తలైవా (రజనీ) మాత్రం కమనాథులకు ఎక్కడా చిక్కలేదు. బీజేపీ అధిష్టానం పెద్దలతో మిత్ర బంధం రజనీ కాంత్‌కు ఉన్న దృష్ట్యా ఆయన్ను ఎలాగైనా పార్టీలోకి రప్పించడం లేదా, మద్దతు సేకరించడం కోసం ఎదురు చూస్తున్న కమలనాథులకు అమిత్ షా పర్యటన తోడ్పాటును అందించే అవకాశాలున్నాయి. శనివారం చెన్నైకు రానున్న అమిత్ షాను రజనీతో భేటీ అయ్యే విధంగా వ్యూహాన్ని రచించారు. మరో ప్రయత్నంగా రజనీని అమిత్ షా ద్వారా ఆహ్వానించే ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. రజనీతో అమిత్ షా భేటీకి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నా, తలైవా నుంచి మాత్రం ఇంత వరకు అపాయింట్ మెంట్ రానట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అమిత్ షా చెన్నై పర్యటనతో కథానాయకుడి మనసు మారాలని కమలనాథులు ఎదురు చూస్తున్నాయి.
వాసన్‌కు ఆఫర్ : బీజేపీ కూటమి నుంచి ఎండీఎంకే బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక, తనకు సీఎం అభ్యర్థిత్వం ఇవ్వాలని డీఎండీకే అధినేత విజయకాంత్ మెలిక పెట్టారు. అలాగే, తమ నేతృత్వంలోని కూటమిలోకి రావాలంటూ బీజేపీకి పీఎంకే అల్టిమేటం ఇచ్చింది. తాజా పరిణామాలతో డీఎండీకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో కొనసాగడం అనుమానంగా మారింది. దీంతో రాష్ర్టంలో మళ్లీ పురుడు పోసుకున్న వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్(తమకా)ను తమ వైపు తిప్పుకోవాలన్న యోచనలో కమలనాథులు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాసన్ తమతో చేతులు కలుపుతారన్న ఆశాభావంతో కమలనాథులు ఉన్నారు. అయితే, తనకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన లేదని, తన లక్ష్యం తమాకాను బలోపేతం చేయడమేనని వాసన్ పేర్కొంటుండడం గమనార్హం.