సాక్షి,చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం కూటమిలోని మిత్రులకు ఇచ్చిన హామీల్ని బీజేపీ విస్మరించిందని చెప్పవచ్చు. దీంతో ఆ కూటమిలోని పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకేలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సమయం దొరికినప్పుడల్లా కేంద్రం తీరును ఎండగట్టే పనిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ కూట మి కొనసాగుతుందని ప్రగల్భాలు పలికిన పార్టీ నాయకులు చివరకు తలా ఓ దారి అన్నట్టుగా పయనించారు. ఈ సమయంలో స్థానిక ఉపసమరం నగారా మోగడంతో మిత్రుల్ని దగ్గర చేర్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది.
తమ కూటమి కొనసాగుతోందని ప్రకటిస్తూ, ఆ పార్టీల మద్దతు కూడగట్టుకునే యత్నం చేసింది. ఆయా పార్టీల నాయకులు మద్దతుతో సరి పెట్టారేగానీ, ఆ పార్టీ అభ్యర్థుల కోసం ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఈ సమయంలో ఈలం తమిళులు, జాలర్ల విషయంలో, హిందీని తమిళులనెత్తిన రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కేంద్రం తీరును ఎండ గట్టే పనిలో మిత్ర పక్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మెగా కూటమి లక్ష్యంగా రాజకీయ పక్షాలకు పిలుపు నివ్వడం, తక్షణం పరోక్ష సంకేతంతో ఎండీఎంకే స్పందించడం, డీఎండీకే సైతం అదేబాటలో పయనించేందుకు రెడీ అవుతుండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి కొనసాగేనా..? అన్న అనుమానాలు బయలు దేరాయి.
అమిత్ షా చుట్టూ..
ఇప్పుడున్న మిత్రులందరూ డీఎంకే పక్షాన చేరిన పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కున చేర్చుకునే వాళ్లు కరువైనట్టే. మళ్లీ రాష్ట్రంలో ఆ పార్టీ ఒంటరిగా మిగలడం ఖాయం. దీన్ని గుర్తెరిగిన ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల్ని ఎప్పటికప్పుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ కూటమి కొనసాగించడం లక్ష్యంగా అమిత్‌షా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో రాష్ట్రంపై ఆయన దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. మిత్రుల్ని బుజ్జగించి, తమ నేతృత్వంలోని అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోవడం, రాష్ట్రం లో బలమైన శక్తిగా అవతరించడమే థ్యేయంగా అమిత్‌షా ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. ఈ విషయాలు ఆ కూటమిలోని ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పీఎంతో భేటీ
ఎస్‌ఆర్‌ఎం ఉద్యోగులు ఒక రోజు వేతనంగా 75 లక్షలు, ఐజేకే తరపున రూ.25లక్షలు నిధిని కాశ్మీర్ పునరుద్ధరణకు పచ్చముత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధిని శనివారం ప్రధాని నరేంద్రమోడీకి పచ్చముత్తు అందజేశారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిలో సాగుతున్న పరిణామాలు, మిత్రుల్లో నెలకొన్న అసంతృప్తి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు అమిత్‌షా రాష్ట్రం నుంచి సేకరిస్తూ వస్తున్నారని, తన దృష్టికి కూడా తెచ్చినట్టు నరేంద్ర మోడీ వివరించినట్టు తెలిసింది. అక్టోబర్ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంపై అమిత్‌షా దృష్టి పెట్టనున్నారని, మిత్రులందరూ మళ్లీ ఒకచోట చేరుతారన్న ధీమాను మోడీ వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంగా పచ్చముత్తును కదలించగా, అమిత్‌షా రాష్ట్రంలో పలుమార్లు పర్యటిం చేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారని, ఏడాదిన్నరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కోవడం లక్ష్యంగా ఆయన సర్వాస్త్రాల్ని సిద్ధంచేసి ఉన్నట్టు పేర్కొన్నారు.
రంగంలోకి అమిత్ షా!
Published Mon, Sep 22 2014 12:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement